సూర్యాపేట జిల్లా:ఎస్సీ ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జీవో తీసుకువచ్చారని, ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా వర్గీకరణకు చట్టబద్ధత వచ్చిందన్నారు.ఎస్సీ,ఎస్టీ కేటగిరిలో మరింత వెనుకబడిన కులాలకు విడివిడిగా కోటాలు ఇచ్చుకోవడానికి అనుమతించడం సానుకూలమైన అంశమని,సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు.బీసీ లలో కూడా అత్యంత వెనుకబడిన కులాలు కడు పేదరికం అనుభవిస్తున్నాయని,రిజర్వేషన్ల ఫలితాలు అన్ని వర్గాలకు దక్కాలంటే బీసీల్లో కూడా వర్గీకరణ చేపట్టాలి,అవి శాస్త్రీయంగా ఉండాలని కోరారు.
ఈ వర్గీకరణను స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లకు వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని,రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పడం సరికాదని,కొన్ని జిల్లాలలో వ్యవసాయ అవసరాల కోసం భర్త బ్యాంకులో రుణం తీసుకుని చనిపోతే రుణమాఫీ కావడం లేదన్నారు.
అలాగే నాలుగు బ్యాంకులలో రుణాలు తీసుకుంటే ఒక్క బ్యాంకు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదన్నారు.అన్ని బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ కొన్ని హామీలు మాత్రమే అమలు చేసిందని,మిగతా హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు.వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ప్రభుత్వం వెంటనే రైతు భరోసా విడుదల చేయాలని కోరారు.
కల్తీ విత్తనాలు,ఎరువులు, పురుగుల మందులను నివారించాలన్నారు.నాగార్జునసాగర్ పరిధిలో ఉన్న లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని ఎక్కువ స్థానాల్లో పార్టీ ప్రజాప్రతినిధులను గెలిపించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,మల్లు లక్ష్మి,జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు,నగరపు పాండు,కోట గోపి,చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.