ఏపీలో అధికార పార్టీ వైసీపీ… పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు చాలా చోట్ల గ్యాప్ వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడంతో పాటు వైసీపీ కోసం పనిచేస్తున్నవారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో భేటీలకు మాత్రమే పరిమితం కాకుండా నేరుగా కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు.
నియోజకవర్గాల్లోని ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నేటినుంచే ప్రారంభించనున్నారు.పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు.
ఒక్కొక్క నియోజవర్గం నుంచి 50 మంది ముఖ్య కార్యకర్తలతో భేటీ కానున్నారు.పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు తదితర అంశాలపై చర్చించనున్నారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
సర్వేల్లో విషయం తెలియడంతో…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం వరసగా సర్వేలు చేస్తూ జగన్ కు నేరుగా నివేదికలను అందించాయి.
పీకే టీం ఇస్తున్న నివేదికలు జగన్ ను ని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయట.అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో పాటు క్యాడర్ కూడా నిరుత్సాహంలో ఉంది.గత ఎన్నికలలో పనిచేసిన కార్యకర్తలు ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో పార్టీకి దూరంగా ఉంటున్నారు.ముఖ్య కార్యకర్తలను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం పెట్టడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పీకే టీం నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
కార్యకర్తలు మౌనంగా ఉన్నారని…
ముఖ్య కార్యకర్తలు మౌనంగా ఉండటం పార్టీకి మంచిది కాదని, వారు 2019 ఎన్నికల్లో ఏదీ ఆశించకుండా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారని పీకే టీం తెలిపింది.కానీ అధికారంలోకి రావడంతో వారు కొంత ఆశలు పెంచుకున్న మాట వాస్తవమేనని, పదవులకు, ఇతర పనులకు ఎమ్మెల్యేలు దూరంగా ఉంచడంతోనే వారు పార్టీకి దూరంగా ఉంటున్నారని పీకే టీం నివేదిక అందజేసింది.
ఈ విషయాన్ని పీకే టీం జగన్ దృష్టికి తీసుకెళ్లడంతోనే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు.

నియోజకవర్గాల వారీగా యాభై మంది కార్యకర్తలను ఎంపిక చేసే బాధ్యత కూడా పీకే టీం కు జగన్ ఇవ్వడం వెనక కూడా వారిలో తిరిగి జోష్ నింపేందుకేనంటున్నారు.జగన్ నేరుగా మాట్లాడి వారికి హామీలు ఇవ్వడంతో పాటు భవిష్యత్ లో పదవులు, పనులపై ప్రాముఖ్యత ఇచ్చే దిశగా కొన్ని ప్రామిస్ లను వారికి ఇవ్వనున్నారని తెలిసింది.ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య కార్యకర్తల విషయంలో కొన్ని సూచనలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇక మొదటగా టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచే కార్యకర్తల సమావేశం ప్రారంభించనున్నారు.దీంతో జగన్ కార్యకర్తలతో ఏం మాట్లాడనున్నారోనని ఆస్తకి నెలకొంది.