నల్లగొండ జిల్లా:ప్రజల దృష్టి లోపాలను నివారించాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి అన్నారు.
మంగళవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల మండలం హలియా పట్టణంలోని 4 వ,వార్దు అక్షయ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు.శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి,నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి రోజు ఎంత మంది వస్తున్నారు.
ఎంత మందికి పరీక్షలు చేస్తున్నారు.ఉచిత కళ్ళద్దాలు ఎంత మందికి పంపిణీ చేస్తున్నారు.
కంటి అద్దాలు, మందులు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ప్రతి రోజూ ఎక్కువ మంది శిబిరంకు వచ్చి పరీక్షలు చేసుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు.
శిబిరాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని ఆదేశించారు.
నర్సరీలు,మన ఊరు మన బడి పనులు తనిఖీహాలియా మున్సిపాలిటీలో మున్సిపల్ నర్సరీ,స్వయం సహాయ సంఘాల మహిళలు నిర్వహిస్తున్న నర్సరీలను,హలియా మండలం కొత్తపల్లి గ్రామంలో నర్సరీలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.మొక్కలు పెంచేందుకు చేసిన ఏర్పాట్లను గమనించిన కలెక్టర్ మున్సిపల్ కమిషనర్,సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
మొక్కలు నాటే సమయానికి తగిన ఎత్తుతో కూడిన వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉండేలా సరైన ప్రణాళికతో నర్సరీల్లో మొక్కలు పెంచేలా పర్యవేక్షణ చేయాలని,జూన్ నాటికి మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉంచాలని సూచించారు.
మనఊరు-మనబడి పనులు తనిఖీ హాలియా మండలం కొత్తపల్లి గ్రామంలో మోడల్ పాఠశాలగా మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మనఊరు -మనబడి కింద రూ.12 లక్షల 95 వేలతో విద్యుదీకరణ,మేజర్, మైనర్ రిపేర్ లు,త్రాగు నీరు సౌకర్యం కల్పించి ఇటీవల ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ మన ఊరు మన బడి కింద కల్పించిన మౌలిక వసతులు పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని సూచించారు.అదే ప్రాంగణంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కింద రూ.34 లక్షల 25 వేల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు పరిశీలించారు.పాఠశాలలో విద్యుద్దీకరణ,మేజర్, మైనర్ పనులు పూర్తి కాగా డైనింగ్ హాల్,ఈజిఎస్ కాంపోనెంట్ కింద చేపట్టిన టాయిలెట్ ల పనులు ప్రగతిలో నున్నవని పంచాయతీ రాజ్ డిఈ, ఏఈలు వివరించారు.
కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని,ఇంకనూ తుది దిశగా మిగిలి ఉన్న పనులను కూడా నాణ్యతతో చేపడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పార్వతమ్మ,మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, ఎంపీడీఓ లక్ష్మి, తహశీల్దార్ మంగ,ఎంఈఓ బాలు నాయక్, పంచాయతీ రాజ్ డిఈ రామాంజనేయులు,ఏఈ సాయిప్రసాద్,వివిధ శాఖల అధికారులు ఉన్నారు.