ఈనెల 16 నుండి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో వజ్రోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16 నుండి 18 వరకు 3 రోజులపాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుటకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు.ఈ నెల 16న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 15 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టాలన్నారు.
ర్యాలీ అనంతరం పాల్గొన్న వారందరికీ భోజన ఏర్పాట్లు చేయాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు.ఒక్కో నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారిని నియమించినట్లు ఆయన అన్నారు.ర్యాలీలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ విధిగా హాజరు కావాలని, ప్రతి మండలం నుండి ఒక లక్ష్యం పెట్టుకొని జన సమీకరణ చేయాలన్నారు.
17వ తేదీన జిల్లా కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత కొమురం భీం బంజారా భవన్, సంత్ సేవాలాల్ భవన్ లను ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని వార్డు మెంబర్ నుండి ప్రతి ఎస్టీ ప్రజాప్రతినిధి, ప్రతి ఎస్టీ ఉద్యోగి, పెద్ద ఎత్తున కోయ, బంజారా తదితర ఎస్టీ ప్రజలను తరలించాలని దీనికి పకడ్బందీ కార్యాచరణ చేయాలన్నారు.ప్రతి మండలం నుండి బస్సులను ఏర్పాటు చేయాలని, రూట్ మ్యాప్ చేపట్టి, సమయానికి గమ్యస్థానం చేరేలా కార్యాచరణ చేయాలన్నారు.టిఫిన్ తో సహా, భోజన ఏర్పాట్లు చేయాలని, ఒక్కొక్క బస్సుకు ఒక అధికారిని బాధ్యునిగా నియమించాలని అన్నారు.18న స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు స్నేహలత మొగిలి, అదనపు కలెక్టర్ రెవిన్యూ en.మాధసూదన్, నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ సురభి, అడిషనల్ డి.సి.పి.లు శబరిష్, సుభాష్ చంద్ర బోస్, ఖమ్మం, కల్లూరు రెవిన్యూ డివిజన్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యచందన, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహన అధికారి వి.వి.అప్పారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.







