అధికారం ఉంటే ఒకలా.అధికారం పోతే మరోలా వ్యవహరించడం రాజకీయ నేతలకు సర్వసాధారణమే.
ఏపీలోనూ టీడీపీ నేతలు దీనికి అతీతమేమీ కాదు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తమదే అన్నట్లు చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
చాలా చోట్ల టీడీపీ నేతలు అజ్ఞాతంలో ఉన్న తరహాలో ప్రవర్తిస్తున్నారు.పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు.
గత మూడేళ్ల కాలంలో చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులను మినహాయించి చూస్తే.దేవినేని ఉమ, బోండా ఉమ, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు తప్ప మిగతా కీలక నేతలంతా ఏమయ్యారు అని అడిగే పరిస్థితులు నెలకొన్నాయి.
కేవలం నలుగురు లేదా ఐదుగురు నేతలే నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు.గతంలో పదవులు అనుభవించిన నాయకులు మాజీ మంత్రులు మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.
ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనంద్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు వంటి నేతలు ఎక్కువగా సైలెంట్‌గా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు.వ్యక్తిగత అవసరాలకు తప్పితే ఆయా నేతలు పార్టీ పరంగా, అధికార పార్టీపై విమర్శలకు బదులిచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.

పలు జిల్లాల్లో కీలక నేతల విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశంపై సీనియర్లతో మంతనాలు జరిపారు.
ఈ క్రమంలో పార్టీలో పనిచేయని నేతలు, ప్రజలకు ముఖం చూపించని నేతలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.వారిపై తప్పనిసరిగా వేటు వేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే భావనలో చంద్రబాబు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రజలతో సఖ్యంగా లేని వారిని ఏం చేయాలో అర్ధం కాకుండా పార్టీ అధిష్టానం మథనపడుతున్నారని టీడీపీ సీనియర్లు చెప్తున్నారు.ఇప్పటికైనా టీడీపీలో తెల్ల ఏనుగులు మేల్కొని పార్టీ కోసం పనిచేస్తాయో లేదో వేచి చూడాల్సిందే.