వ్యాపారంలో, రాజకీయల్లో స్పెక్యులేషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.వివిధ అంశాలపై అంచనాలు వేస్తూనే ఉంటారు.
రాజకీయాల్లో స్పెక్యులేషన్‌ను మీడియా భాషలో ‘జోస్యం’ అంటారు.ప్రతి రాజకీయ నాయకుడు జ్యోతిష్యుడిలా మాట్లాడుతూనే ఉంటాడు.
ఈ జాబితాలో ఆంధ్రాకు చెందిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కూడా చేరారు.ప్రస్తుతం ఏపీని పట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి? వారికి ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటి? అందరికీ తెలిసిందే.అదే….’ప్రత్యేక హోదా’.రాష్ర్టం విడిపోయి ఏడాది దాటినా కేంద్రం ప్రత్యేక హోదా ఇప్పటివరకు ఇవ్వలేదు.రాష్ర్ట విభజన జరిగినప్పుడు తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని భాజపా బల్ల గుద్ది మరీ చెప్పింది.
అయితే అధికారంలోకి వచ్చాక మాటల వరకే పరిమితమైందిగాని చేతలు లేవు.ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో గట్టిగా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారు.
స్పెషల్ స్టేటస్ మీద ఏపీ ప్రజలు ఆశలు వదిలేసుకోగా, టీడీపీ నాయకులు మాత్రం ఇంకా నమ్మకం పెట్టుకున్నారు.తాజాగా ఎంపీ సుజనా చౌదరి ప్రత్యేక హోదాపై జోస్యం చెప్పారు.
ఆగస్టు చివరి నాటికి ప్రత్యేక హోదా వస్తుందట….! విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు దీనిపై ప్రయత్నాలు చేస్తున్నారట….! ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, సెక్షన్ ఎనిమిది….మొదలైనవన్నీ విభజన చట్టంలో భాగాలేనని అన్నారు సుజనా చౌదరి.ప్రజలకు ఆశలు కల్పంచడమే నాయకుల పని కదా…! ఈయన ఆ పనే చేశారు.