రాజకీయంగా సరైన నిర్ణయం తీసుకోకపోతే .ఆ తరువాత రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారుతుందనే దానికి ఉదాహరణగా ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేలు పరిస్థితిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.వైసీపీలో చేరకపోయినా ఆ పార్టీ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు.
ఇప్పటికే గుడివాడ టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్నారు.రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైసీపీలో సరైన ప్రాధాన్యం ఆయనకు దక్కుతున్నా… నియోజకవర్గంలో వైసీపీ కేడర్ తో ఆయనకు తరచుగా విభేదాలు వస్తూనే ఉన్నాయి.ఇప్పటికే అనేక మార్లు జగన్ వద్ద పంచాయతీలు జరిగాయి.
ఇదిలా ఉంటే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచారు.ఆ తర్వాత ఈ క్రమంలో వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.
వైసిపి దక్షిణ నియోజకవర్గ సమన్వయ కర్త గాను ఆయనకు పదవిని కట్టబెట్టారు.అయితే వైసీపీలో చేరిన దగ్గర నుంచి తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ,పూర్తిగా పక్కన పెట్టేశారు అని అసంతృప్తితో ఉన్న గణేష్ కుమార్ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాదు ఈ లేఖను ప్రభుత్వ సలహాదారు వైవీ సుబ్బారెడ్డికి పంపించారు.విశాఖ బాధ్యతలు విజయసాయిరెడ్డి చూసిన సమయంలోనే గణేష్ కుమార్ ఆయనను పక్కన పెట్టారు.

ప్రస్తుతం విశాఖ ఇన్చార్జిగా వచ్చిన సుబ్బారెడ్డి అయినా తనను గుర్తిస్తారని గణేష్ కుమార్ ఆశపడగా.సుబ్బారెడ్డి సైతం అదే విధంగా వ్యవహరిస్తూ ఉండడంతో… విసుగుచెందిన గణేష్ కుమార్ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.కానీ వైసీపీకి విధేయుడు గానే ఉంటానని ప్రకటించారు.2024 ఎన్నికల్లో గణేష్ కుమార్ కు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని తేలిపోయిందట.ఈ క్రమంలోనే మళ్లీ ఆయన టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా ఆయన పట్టించుకోకపోవడం… వైసీపీలోను ప్రాధాన్యం దక్కక పోవడంతో వాసుపల్లి గణేష్ కుమార్ రాజకీయ జీవితం అయోమయంలో పడింది.