రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది .2024 ఎన్నికలలో వైసీపీని ఓడించేందుకు టిడిపిలోని అన్ని విభాగాలను మరింత పటిష్టం చేసే విషయంపై దృష్టి సారించింది.దీనిలో భాగంగానే టిడిపి సోషల్ మీడియా విభాగానికి జీవీ రెడ్డి అనే వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించారు.ఈయన పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.ప్రస్తుతం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ టీడీపీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలను చూస్తున్నారు. జీవి రెడ్డి న్యాయవిద్యతో పాటు, సిఏ చేశారు.
సామాజిక, రాజకీయ, వర్తమాన, ఆర్థిక వ్యవహారాలపై పూర్తిగా అవగాహన ఉంది.దీంతో సోషల్ మీడియాలో వైసిపి ప్రభుత్వంను అన్ని ఆధారాలతో ఇరుకున పెట్టేందుకు అవసరమైన వ్యూహాలను జీవీ రెడ్డి అందించగలరనే ఉద్దేశంతో బాబు ఆయనను అధ్యక్షుడిగా నియమించారు.
చింతకాయల విజయ్ తో సమన్వయం చేసుకుంటూ, సోషల్ మీడియాను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటూ, వైసీపీని ఇరుకున పెట్టే విధంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతలను ఆయనకు అప్పగించింది.

వైసిపి సోషల్ మీడియా విభాగం ప్రస్తుతం పటిష్టంగా ఉంది.2019 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది.ఆ ఎన్నికల్లో 151 స్థానాలు దక్కించుకోవడంలో సోషల్ మీడియానే కీలకపాత్ర పోషించింది.
ఇప్పుడు అంతకంటే సమర్థవంతంగా టిడిపి సోషల్ మీడియా విభాగాన్ని నడిపించేందుకు బాబు ఈ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాటి అమల్లోని లోపాలను, అలాగే జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, దుబారా, తమ పార్టీ నాయకులకు అనుచితంగా చేస్తున్న లబ్ధి, ప్రజల్లో వైసిపి ప్రభుత్వం పాలనపై వస్తున్న వ్యతిరేకత, టిడిపి పెరుగుతున్న సానుభూతి, వీటన్నిటిని టిడిపి సోషల్ మీడియా విభాగం ఇక పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనుంది.







