ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ పొలిటికల్ చర్చకు దారితీసింది.
దీనికి ముఖ్యకారణం టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) (పీకే) కీలక సమావేశం నిర్వహించడమేనని చెప్పుకోవచ్చు.సీఎం అభ్యర్థిపై చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో టాపిక్ డైవర్ట్ చేసిన చంద్రబాబు పీకే మీదకు ప్రజల దృష్టి మరల్చేలా చేశారని పలు వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో జరిగిన సంగతి తెలిసిందే.యువగళం – నవశకం పేరుతో ఏర్పాటైన భారీ బహిరంగ సభకు చంద్రబాబు, బాలకృష్ణతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం హాజరయ్యారు.
ఈ సందర్భంగానే లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన అధికారంలోకి వస్తుందన్న ఆయన చంద్రబాబే మరోసారి సీఎం అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.బహిరంగంగానే పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదని లోకేశ్ తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి కావాలంటే అనుభవం కావాలని, అటువంటి రాజకీయ అనుభవం పవన్ కల్యాణ్ కు లేదని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో చంద్రబాబే సీఎం అభ్యర్థి అని ఖరాకండిగా చెప్పారు.
లోకేశ్( Nara Lokesh ) కామెంట్స్ పై జనసేనాని సైలెంట్ గా ఉన్నప్పటికీ జనసేనా పార్టీకి చెందిన గ్రౌండ్ లెవల్ క్యాడర్ లో మాత్రం పొత్తుల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది.ఈ కారణంగా కొద్దిగొప్ప కూడా జనసేన సపోర్ట్ తక్కువైతే ఎలా అని చంద్రబాబు( Chandrababu) యోచనలో పడ్డారు.
తన కొడుకు చేసిన వ్యాఖ్యల వలన జనసేన క్యాడర్ లో వచ్చిన వ్యతిరేకత, చెలరేగిన అసంతృప్తి గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో కొత్త డ్రామాకు తెర తీశారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేందుకు బీహార్ పీకే (ప్రశాంత్ కిషోర్ )ను రంగంలోకి దింపారని పలు వాదనలు వినిపిస్తున్నాయి.
నిజానికి చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి .ఆ విషయాన్ని ఎన్నికలు ముగిసిన తరువాత చెప్పాలని టీడీపీ – జనసేన భావించిందంట.అయితే లోకేశ్ ముందే నోరు జారడంతో తిప్పలు తప్పేలా లేవని తెలుస్తోంది.అయితే పొత్తు నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా సీఎం అభ్యర్థిగా ఉండాలని జనసేన క్యాడర్ ఆశిస్తుంది.
ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన తమకు సరైన న్యాయం జరగాలంటే జనసేనాని సీఎం కావాలని గట్టిగా భావిస్తున్నారట.ఇటువంటి పరిస్థితుల్లో లోకేశ్ నోరు జారడంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదనే విషయాన్ని స్వీకరించలేకపోతున్నారు.దీని వల్ల భవిష్యత్ లో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని భావించిన చంద్రబాబు పీకేతో భేటీ అంటూ టాపిక్ డైవర్ట్ చేశారని కొందరు చెబుతున్నారు.
అటు ప్రశాంత్ కిషోర్ (పీకే) తో టీడీపీ మంతనాలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.ఆ పీకే (ప్రశాంత్ కిషోర్) వచ్చినా, ఈ పీకే (పవన్ కల్యాణ్ ) వచ్చిన టీడీపీని బాగు చేయలేరని చెప్పారు.
గతంలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాకర్తగా పని చేశారన్న ఆయన దేశంలో చాలా రాజకీయ పార్టీలకు కూడా ఆయన పని చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు.గెలుస్తామన్న నమ్మకం, ధైర్యం లేకనే ఢిల్లీకి వెళ్లి పీకేను బ్రతిమిలాడి ఇక్కడకు రప్పించుకున్నారని విమర్శించారు.
ఈ క్రమంలోనే ఎంత మంది కలిసొచ్చినా జగన్ ను ఏం చేయలేరని పేర్కొన్నారు.ఏపీలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనమే కొనసాగుతుందని, జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వమే అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని వెల్లడించారు.