అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు వారు నెలకొల్పిన తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) నేడు ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందింది.అమెరికాలో ఉండే తెలుగు వారికి సహాయ సహకారాలు అందించడం కోసం, వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ సంఘం క్రమ క్రమంగా తెలుగు బాష అభివృద్ధి కోసం, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించే క్రమంలో తెలుగు వారి పిల్లలకు తెలుగు బాషను నేర్పిస్తూ వారికి తెలుగు సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేలా ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది.
ముఖ్యంగా పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీసేలా ఎప్పటికప్పుడు వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహించే తానా తాజాగా.
“తానా బాలోత్సవం” పేరుతో దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ వేదిక ద్వారా పిల్లలకు లలితా కళల పట్ల అవగాహన కల్పించి వారిలో సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నం చేసింది.తానా బాలోత్సవం చైర్మెన్ దీపిక సమ్మెట సారధ్యంలో అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ వేడుకలకు వందలాది మంది పిల్లలో ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పిల్లలను వారి వారి వయసులను బట్టి గ్రూపులు గా విభజించారు.
5 ఏళ్ళ వయసు నుంచీ 10 ఏళ్ళ వయసు వరకూ అలాగే 11 ఏళ్ళ నుంచీ 16 ఏళ్ళ వయసు వరకూ రెండు గ్రూపులుగా విభజించారు.వీరికి సంగీతం, నృత్యం, పాటలు, కళలు, పబ్లిక్ స్పీచ్, పద్య పటనం ఇలా పలు రంగాలలో పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం ముగింపు రోజున ప్రముఖ రచయితలు, నృత్య కళాకారిణిలు, సింగర్స్ గౌరవ అతిధులుగా పాల్గొన్నారు.రచయిత ,రాజ్య సభ సభ్యుడైన విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
పిల్లలలో తెలుగు బాష పై ప్రేమాభిమానాలు పెంచేలా తానా చేస్తున్న కృషిని అభినందించారు.







