నల్లగొండ జిల్లా: ఉదయ సముద్రం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు రైతులందరికీ త్వరలోనే సాగునీరు వస్తుందని, అందువల్ల రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు.
ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సాగు నీరు వచ్చే ఇన్ ఫాల్ రెగ్యులేటర్ ను అలాగే ఉదయ సముద్రం నుండి నీరు బయటకు వెళ్లే ఔట్ ఫాల్ రెగ్యులటర్లను ఆకస్మికంగా తనిఖీచేశారు.అక్కంపల్లి రిజర్వాయర్ హై లెవెల్ కెనాల్ ద్వారా ఉదయ సముద్రంలోకి నీరు వస్తుండగా,ఉదయ సముద్రం నుండి డి-39, డి-40 ద్వారా ఆయకట్టు భూములకు కెనాల్ ద్వారా నీరు వెళ్ళటాన్ని కలెక్టర్ పరిశీలించారు.డి-39 కింద 10 వేల ఎకరాలు,డి-40 కింద 27 వేల ఎకరాలు సాగు అవుతుండగా,
నీటిమట్టం పెరిగిన తర్వాత కింది భాగంలో ఉన్న అన్ని చెరువులను, కుంటలను నింపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.నాగార్జున సాగర్ ప్రాజక్ట్ లో సరిపోయినంత నీరు ఉన్నందున రైతులు ఎవరూ తొందరపడి సాగునీటిని మళ్లించవద్దని కోరారు.
హై లెవెల్ కెనాల్ కింద మూసి రివర్ కింది భాగంలో ఉన్న డి -55 వరకు నీరు అందించే ప్రయత్నాన్ని చేస్తామని కలెక్టర్ తెలిపారు.ఉదయ సముద్రం కింద ఉన్న ఆయకట్టు రైతులు అందరికీ సాగునీరు వస్తుందని,అందువల్ల ఎవరు ఆందోళన చెందవద్దని,తొందరపడి నీటిని మళ్లించుకోవద్దని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఈఈలు జి.శ్రీనివాస్ రెడ్డి,సురేందర్ రావు,డిఈ ఆనందరావు, ఏఈలు,లస్కర్లు,వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.