కరోనా వైరస్ కల్లోలం భూమిపై ఇంకా కొనసాగుతూనే వుంది.ఇంకా లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండటంతో విదేశాల్లో మరణించిన వారి అవస్థలు వర్ణనాతీతం.
అచ్చం ఇదే తరహా సమస్యతో కష్టాలు పడుతోంది ఓ తెలుగు కుటుంబం.వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్‌కు సమీపంలోని బోడుప్పల్ మేడిపల్లికి చెందిన పానుగంటి శ్రీధర్ అమెరికాలో ఆరేళ్లుగా టెక్ మహేంద్రలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు.న్యూయార్క్ సిటీలోని బాఫెల్లాలో నివాసముండే అతడికి భార్య ఝాన్సీ, కుమారుడు శ్రీజన్(5) ఉన్నారు.
ఈ ఏడాది మార్చిలో సోదరుడి వివాహం నిమిత్తం భార్య ఝాన్సీ, శ్రీజన్ ఇండియాకు వచ్చారు.
అయితే ఆ సమయంలో భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ఇక్కడే ఉండిపోయారు.
నాటి నుంచి శ్రీధర్ అమెరికాలో ఒంటరిగానే ఉంటున్నాడు.భార్యాపిల్లల యోగక్షేమాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు.
అయితే నవంబర్ 27న ఉదయం శ్రీధర్ భార్య ఝాన్సీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని నుంచి సమాధానం రాలేదు.ప్రతిరోజూ ఎన్ని పనులున్నా.
తన ఫోన్‌ను లిఫ్ట్ చేయకుండా వుండని భర్త నుంచి స్పందన రాకపోవడంతో ఝాన్సీ ఆందోళనకు గురైంది.

వెంటనే అమెరికాతో తాము నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో తెలిసిన వారికి ఫోన్ చేసింది.దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూడగా శ్రీధర్ నిర్జీవంగా కనిపించాడు.
ఈ విషయం తెలుసుకున్న భార్య ఝాన్సీ ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఇదే విషాదం అనుకుంటే లాక్‌డౌన్, ఇతర చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసుకుని శ్రీధర్ మృతదేహం భారతదేశానికి రావాలంటే కనీసం ఆరు నెలలైనా పడుతుందని అధికారులు చెప్పడతో ఆయన కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం.
మరోవైపు పోస్ట్‌మార్టం, కరోనా నిర్థారణ పరీక్షలు పూర్తయినా మృతదేహాన్ని ఇండియాకు పంపించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.