సింగపూర్‌లో( Singapore ) విషాదం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ గురు నారాయణ అయ్యర్ నారాయణన్( Narayana Iyer Narayanan ) ఇక లేరు.
గుండెపోటుకు గురైన ఆయన జూన్ 23న తుదిశ్వాస విడిచినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.దశాబ్ధాలుగా సింగపూర్ స్టాక్ మార్కెట్‌లలో వాటాదార్ల ప్రయోజనాలను కాపాడటంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్‌పై పలు సూచనలు కూడా ఇచ్చేవారు నారాయణన్.
ఆయన వయసు 95 సంవత్సరాలు.దీనిపై నారాయణన్ కుమార్తె రెమా( Rema ) మాట్లాడుతూ.95 ఏళ్ల వయసులోనూ నాన్న ఆర్ధిక అంశాలపై చాలా అవగాహన కలిగి వున్నారని పేర్కొన్నారు.డౌ జోన్స్ ఇండెక్స్, సాట్స్ స్టాక్ ప్రైజ్, బ్రిటీష్ పౌండ్, మలేషియా రింగ్‌గిట్‌లను ఆయన ప్రతిరోజూ క్రమం తప్పకుండా తనిఖీ చేసేవారని రెమా వెల్లడించారు.
నారాయణన్ మరో కుమార్తె రాధిక మాట్లాడుతూ.నాన్న చిన్న వాటాదారుల ఛాంపియన్ అన్నారు.పెట్టుబడి పెట్టిన కంపెనీలలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు వారికి వుందని నారాయణన్ నమ్మేవారని రాధిక పేర్కొన్నారు.

గణిత శాస్త్రంలో పట్టా పొందిన నారాయణన్ 1950లలో స్టాక్ బ్రోకర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.1968లో ఆయన ఓంగ్ అండ్ కో అనే స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ( Ong and Co )తొలి భారతీయ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.తర్వాత అలయన్స్ సెక్యూరిటీస్‌లో డైరెక్టర్‌గా చేరిన నారాయణన్.72 ఏళ్ల వయసులో 1999లో పదవీ విరమణ చేశారు.యాక్టివ్ రిటైల్ ఇన్వెస్టర్ తరచుగా ఏజీఎంలు , సింగపూర్ బ్యాంక్‌లు, శీతల పానీయాల తయారీదారు , ప్రాపర్టీ గ్రూప్ ఫ్రేజర్ అండ్ నీవ్, టెల్కో సింగ్‌టెల్ వంటి కంపెనీల సమావేశాలలో నారాయణన్ కనిపించేవారు.

తన వ్యూహాత్మక నిర్ణయాలతో వాటాదారులను ప్రభావితం చేసే అంశాలపై సమావేశాలను నిర్వహించేవారు.కార్పోరేట్ గవర్నెన్స్‌లో కీలకమైన పెట్టుబడి స్క్రీనింగ్ సాధనంగా మారకముందే దానికి సంబంధించిన సమస్యను ముందుగానే ప్రశ్నించారు.కార్పోరేట్ సమావేశాల తర్వాత జర్నలిస్టుల బృందంతో పిచ్చాపాటిగా మాట్లాడేవారు.మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన సమస్యలు, వారి ప్రతిస్పందనలు, మైనారిటీ వాటాదారుల ఆందోళనలపై దృష్టి కేంద్రీకరించారు.మూలధన పునర్నిర్మాణం, బేసి వాటాలు, నియంత్రణ, సామూహిక ఆస్తి అమ్మకాలు, నియామకాలు, డైరెక్టర్ల వేతనం వంటి విస్తృత విషయాలపై ఆయన తరచుగా పత్రికలకు లేఖలు రాసేవారు.అలాంటి నారాయణన్ ఇక లేరన్న వార్త తెలుసుకున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.







