కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీనా ? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు పోలేదు ? నరేంద్ర, విజయశాం తి, దేవేందర్‌గౌడ్ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? నాలుగు రోజుల్లో తోక ముడుస్తారు.ఎటూ కాకుండా తెరమరుగై పోతా రు ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాజకీయా ల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.ఇక్కడ ఎవరి పేరునూ కేసీఆర్ పేర్కొనలేదు.
కానీ, కొత్త పార్టీ గురించి మాత్రం ఒక పెద్ద హెచ్చరిక చేశారు.కొత్తపార్టీలు పెట్టిన వారు ఎవరూ బతికి బట్టకట్టిన వారు లేరన్నారు.

నిజానికి కేసీఆర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని కానీ ఎవరూ ఊహించలేరు.ఎందుకంటే బలమైన పార్టీగా, తెలంగాణలో తనకు తిరుగులేదని చెప్పుకొనే కేసీఆర్ కొత్తపార్టీలను ఆహ్వానించాలి.ఎందుకంటే ఎన్ని పార్టీలు వస్తే .అంతగా ప్రజాస్వామ్యంలో నేతల సంఖ్య పెరిగి ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది.ఒకప్పుడు టీఆర్ ఎస్ ఆవిర్భావ సమయంలో ఇదే మాట ఆయన చెప్పారు.కానీ ఇప్పుడు మాత్రం కొత్తపార్టీ పేరు చెప్పకుండానే కొత్తపార్టీ పెట్టినవారు మట్టికొట్టుకుపోయారని పరోక్షంగా వ్యాఖ్యలు సంధించారు.
వాస్తవానికి ఇటీవల కాలంలో కొత్తపార్టీ ప్రస్తావన ఎక్కువగా జరుగుతోంది.ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల తెలంగాణలో కొత్తపార్టీ పెడుతున్నారని అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
ఇక, ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తే అధికార టీఆర్ ఎస్‌లోను, ప్రతిపక్షం కాంగ్రెస్‌లోను రెడ్డి సామాజిక వర్గం ఒక రాజకీయ శూన్యతను ఎదుర్కొంటోంది.ఈ క్రమంలో మార్పు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
తమకు సరైన వేదిక లేదని భావించిన వారు కూడా ఉన్నారు.
ఇప్పుడు ఇలాంటి కీలక సమయంలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో షర్మిల వంటి బలమైన నాయకురాలు రంగంలోకి దిగితే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆయన భయపడుతున్నారని అంటున్నవారు కూడా ఉన్నారు.తాజా వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.