ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసిపికి రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేవు.2024 ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని నడిపించే అంత బలం ఆ పార్టీకి ఉంది.151 సీట్లను 2019 ఎన్నికల్లో గెలుచుకోవడంతో వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేకుండా ఉంది.అయితే ప్రస్తుతం జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు.2024 ఎన్నికలకు చాలా సమయం ఉన్నా… త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు.పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అనేక మార్పులు చేపడుతూ కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.
మంత్రులు , ఎమ్మెల్యేలు నిరంతరం జనాల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విషయం పైనే ఎక్కువ దృష్టి పెట్టాలంటూ జగన్ పదేపదే హితబోధ చేస్తున్నారు.
ఈ హడావుడి అంతా చూస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
దీనికి తగ్గట్లుగానే ఆ పార్టీ కీలక నాయకుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై పరోక్షంగా స్పందించారు.ఏడాది రెండేళ్ళలో ఎన్నికలకు వెళ్ళబోతున్నా మంటూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు, జనసేన, బీజేపీ వంటి పార్టీలకు ముందస్తు ఎన్నికలకు జగన్ ప్రభుత్వం వెళ్ళబోతోంది అనే సమాచారం అందడంతో వారు కూడా స్పీడ్ పెంచారు.క్షేత్ర స్థాయిలో బలం పెంచుకునే విషయంపై దృష్టి సారించారు.
మరోవైపు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ సైతం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉంది.దీనికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇప్పుడు కూడా తెలంగాణ అధికార పార్టీ బాటలో వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ముందస్తు ఎన్నికల విషయమై సంకేతాలు అందుతూ ఉండటంతోనే ఇప్పటినుంచే అలర్ట్ అవుతూ, ప్రజల్లో తిరుగుతూ సర్వేలలో తమ పనితీరు మెరుగైందని రిపోర్టులు వచ్చేలా చేసుకుంటున్నారు .ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్న వారు టికెట్ ప్రయత్నాలు అప్పుడే మొదలు పెడుతూ, తమ పలుకుబడి ద్వారా టికెట్ ను రిజర్వ్ చేసుకునే పనిలో పడ్డారు.కాకపోతే ఈ ముందస్తు ఎన్నికల విషయమై జగన్ మాత్రం తన నిర్ణయం ఏమిటి అనేది బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.