రేణు దేశాయ్ రాజకీయాల్లోకి రాబోతుంది, ఆమె వైకాపాలో జాయిన్ అయ్యి పవన్‌కు వ్యతిరేకంగా పని చేయబోతుంది అంటూ కొన్ని రోజులుగా కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు ఇతరులు ప్రచారం చేస్తున్నారు.రేణుదేశాయ్ తీరు చూస్తుంటే త్వరలో జరుగబోతున్న ఎన్నికల్లో వైకాపాకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కూడా ఓకే చెప్పేలా ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి.
మీడియాలో రేణు దేశాయ్ గురించి వస్తున్న వార్తలకు, సోషల్ మీడియాలో కామెంట్స్‌కు ఆమె సమాధానం చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చింది.
పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకే రోజు కర్నూలులో పర్యటించడం పెద్ద తప్పు అయ్యింది.
ఆయన విషయం నాకు తెలియకుండానే నేను ఒక షో కోసం అక్కడకు వెళ్లాను.అక్కడ ఆయన పర్యటిస్తున్న విషయం నాకు తెలియదు.రెండు నెలల క్రితం అనుకున్నట్లుగా ఆ ప్రాంతానికి మేము వెళ్లాము.అంతే తప్ప అప్పటికప్పుడు నిర్ణయించుకున్నది కాదు, పవన్ కళ్యాణ్ గారికి పోటీగా అస్సలు కాదు.
ఆయన రైతుల సమస్యలను తెలుసుకునేందుకు అక్కడకు వెళ్లడం అభినందనీయం, అలాగే ఒక టీవీ షో కోసం రైతులతో మాట్లాడేందుకు నేను వెళ్లాను.

మేము ఇద్దరం చేసింది మంచి పని, అయినా కూడా నన్ను ఇలా విమర్శించడానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు.నేను రైతుల సమస్యల గురించి సినిమా తీయాలని కోరుకుంటున్నాను.అందుకు ఈ షో బాగా హెల్ప్ అవుతుందని భావించి కర్నూలు వెళ్లాను.
మరి దానికి ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు అంటూ రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.పని పాట లేని వారు చెత్త పుకార్లు క్రియేట్ చేసి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ రేణు ఆవేదనతో మాట్లాడింది.
ఏ పని చేసినా విమర్శించే వారికి ఏమని సమాధానం చెప్పగలం.ఎవరేం అనుకున్నా నేను రాజకీయాల్లోకి వెళ్లలేదు, ఆ ఆలోచన నాకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.







