ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతోంది.మరో రెండేళ్లలో మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి.
దీంతో మళ్లీ గెలిచి అధికారంలో కూర్చోవాలని వైసీపీ భావిస్తోంది.గత ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ సపోర్ట్ ఇచ్చిన మాట నగ్నసత్యం.
ఇప్పుడు మరోసారి బీజేపీని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని వైసీపీ వ్యూహాలు పన్నుతోంది.అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి తెలిసిన విషయమే.
ఇప్పుడు వైసీపీ విషయంలో బీజేపీ ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది.
ఏపీలోని ప్రస్తుతం 22 మంది వైసీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలుగానే చలామణి అవుతున్నారు.
ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వైసీపీ పల్లెత్తు మాట కూడా అనడం లేదు.పైగా పార్లమెంట్‌లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా బేషరతుగా మద్దతు తెలుపుతోంది.ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం వల్లే ద్రౌపది ముర్ము గెలుపు సులభమైంది.ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం.
అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసిన తర్వాత బీజేపీ, వైసీపీల మధ్య బంధం ఎలా ఉంటుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల పరిణామాలు చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సహకారం అందించేందుకు బీజేపీ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఏపీ పరువు తీశారు.ఆ తరువాత టీడీపీ ఎంపీలు ఉభయ సభలలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఎపీ అప్పుల కుప్పే అంటూ ఇచ్చిన సమాధానం కూడా వైసీపీని ఇబ్బందులకు గురి చేసింది.
ఏపీలో రైల్వే ప్రాజెక్టులన్నీ ఆగిపోవడానికి వైసీపీ సర్కారే కారణమని వివరించి బీజేపీ పార్లమెంట్ సాక్షిగా చెప్పి వైసీపీ ప్రభుత్వం పరువు తీసింది.మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి వైసీపీ సర్కారే కారణమని మరో కేంద్రమంత్రి వెల్లడించారు.
ఇదంతా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం ఉండాలని బీజేపీ భావిస్తోంది.అందుకే తమతో పొత్తు పెట్టుకునేలా వైసీపీతో బీజేపీ కయ్యానికి దిగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవేళ వైసీపీ ఒప్పుకోకపోతే టీడీపీ ఉంది కదా అనే భరోసాలో కమలం పార్టీ పెద్దలు ఉన్నారని వివరిస్తున్నారు.