టిడిపి అధినేత చంద్రబాబు రాబోయే ఎన్నికలపై ఒక క్లారిటీతో ఉన్నారు.సాధారణ ఎన్నికలు 2024లో జరగాల్సి ఉన్నా, జగన్ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బాబు బలంగా నమ్ముతున్నారు.
దీనికి ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆయన విశ్లేషణ చేసుకుంటూ ఈ విధంగా ఆలోచిస్తున్నారు.దీంతో వైసీపీని ఎదుర్కునేందుకు ముందస్తుగానే బాబు అన్ని ఆస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.దీనిలో భాగంగానే ప్రస్తుత టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే లందరికీ బాబు టిక్కెట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించేశారు.2019 ఎన్నికల్లో టిడిపి నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా, వారిలో నలుగురు వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.
దీంతో మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఖరారు చేశారు. వీరిలో 18 మంది టిడిపి తరఫున యాక్టివ్గానే ఉంటూ అధికార పార్టీ వైసీపీ పై విమర్శలు చేస్తూ , నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావుడి చేస్తున్నా, విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం మాత్రం మొదటి నుంచి అనుమానస్పదంగానే ఉంది .ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ… అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.టిడిపిలో ఉండేందుకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ… సరైన రాజకీయ ప్రత్యమ్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.
అప్పుడప్పుడు మాత్రమే తాను ఉన్నాను అన్నట్లుగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.గంటా విషయంలో చంద్రబాబుకు తీవ్ర అసంతృప్తి ఉన్నా, ఇప్పుడు ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్ల లిస్టులో గంటా పేరును కూడా బాబు చేర్చారు .

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించి.గంటా పేరుని తప్పిస్తే బాగోదు అనే ఉద్దేశంతోనే బాబు ఆయన పేరు కూడా ప్రకటించినట్లుగా టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.గత కొంతకాలంగా నియోజకవర్గాల ఇన్చార్జీలను, అభ్యర్థులను ప్రకటిస్తూ బాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు .వారు జనాల్లోకి వెళ్లి బలం పెంచుకునేందుకు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతో బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నారు.అన్ని విషయాలలోను వైసీపీ పై పై చేయి సాధించేందుకు, ఎన్నికల సమయంలో టికెట్లు భరించడం కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అసంతృప్తులను బుద్ధిగించేందుకు అవకాశం ఏర్పడుతుందని, ఎన్నికల్లో టిడిపి విజయానికి ఈ వ్యూహం పనిచేస్తుంది అనే లెక్కల్లో బాబు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.







