తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడం, మరోవైపు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉండడంతో, కేంద్ర అధికార పార్టీ బిజెపి అలర్ట్ అయింది.తెలంగాణలో బిజెపి జెండా ఎగురువేసేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ నేరుగా ప్రజలకు దగ్గర అయ్యేందుకు, టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు నేటి నుంచి ప్రజాగోస, బిజెపి భరోసా పేరుతో వీధి సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
కేసీఆర్ కుటుంబ పాలనతో పాటు, బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు బిజెపి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు ఈనెల 25వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా పదకొండు వేల శక్తి కేంద్రాల్లో వీటిని నిర్వహించబోతున్నారు.ప్రజాగోష బీజేపీ భరోసా కార్యక్రమం బాధ్యతలను నిర్వహించే వారికి రంగారెడ్డి జిల్లా మన్నుగూడా లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.11 వేల సమావేశాల తర్వాత, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా వీధి సమావేశాలను నిర్వహించే వారి వివరాలను ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.ఎంపీలు ,ఎమ్మెల్యేలతో పాటు , బిజెపి కీలక నాయకులంతా ఆయా నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.మొదటి రోజు సమావేశాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు, ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నట్లు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రజాగోష బిజెపి భరోసా 11 కూడలి సమావేశాలు సమన్వయకర్త కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్ పల్లి చౌరస్తా వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ లోని బల్కంపేట ఆలయం వెనుక నిర్వహించే సమావేశంలో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, శేరిలింగంపల్లి గోపి నగర్ లో బిజెపి మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు పాల్గొనబోతున్నట్టు తెలంగాణ బిజెపి ప్రకటించింది.ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ నాయకులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
.






