ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి.గతంలో కాపుల ఓటు బ్యాంక్‌పై విస్తతంగా చర్చ జరిగేది.
కానీ ప్రస్తుతం బీసీల ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయి.ఒక్కమాటలో చెప్పాలంటే రాజ్యసభ సీట్ల అంశం రాజకీయ పార్టీలలో బీసీల ఓటు బ్యాంక్ పాలిటిక్స్‌కు తెరతీసింది.
ఏపీలో 50 శాతానికి పైగా బీసీలు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంక్ తమకు కీలకం అవుతుందని అధికార పార్టీ వైసీపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో వీలు కుదిరిన ప్రతీసారి బీసీలకు పదవులు పంచుతూ సీఎం జగన్ తన మార్క్ రాజకీయాన్ని బహిర్గతం చేస్తున్నారు.
ఇటీవల కేబినెట్ విస్తరణలో ఏకంగా 10 మంది బీసీలకు మంత్రి పదవులు కట్టబెట్టారు.ఇప్పుడు నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే వాటిలో రెండు సీట్లు బీసీలకు కేటాయించి మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
నిజం చెప్పాలంటే కొన్నేళ్ల క్రితం వరకు ఏపీలో బీసీల ఓటు బ్యాంక్ చెక్కు చెదరకుండా టీడీపీకే ఉండేది.కానీ 2019 ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకులో వైసీపీ కొంత షేర్ సాధించింది.అదే టీడీపీ ఓటమికి కారణమైందనేది రాజకీయ విశ్లేషకుల మాట.దీంతో వచ్చే ఎన్నికల్లోనూ బీసీలను ప్రసన్నం చేసుకోవాలనే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.దీంతో తమది బీసీ పక్షపాత పార్టీ అని వైసీపీ గట్టిగా సంకేతాలు పంపుతోంది.

అయితే రాజ్యసభ సీట్ల విషయానికి వస్తే ఏపీలో బీసీలే జగన్‌కు కనిపించలేదా అని టీడీపీ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు.పేరుకే బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి వారి నోళ్లు కట్టి పడేసి.అసలైన అధికారం రెడ్డి సామాజిక వర్గమే చెలాయిస్తోందని టీడీపీ సీనియర్ నేతలు యనమల, అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఒక అడుగు ముందుకేసి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చుగా అంటూ వైసీపీ అధినేత జగన్‌ను ప్రశ్నిస్తున్నారు.ఎన్ని జన్మలు ఎత్తినా బీసీలను టీడీపీ నుంచి విడదీయలేరంటూ గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
మరోవైపు వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలపై ఎదురుదాడికి దిగారు.బీసీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆర్.
కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క బీసీకి అయినా రాజ్యసభ సీటు ఇచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
వైసీపీలో బీసీని సీఎం చేయాలని అడుగుతున్న టీడీపీ నేతలు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయనకు బదులుగా బీసీలను సీఎం చేస్తారా అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు.
.