నల్గొండ జిల్లా చండూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్ధం అయిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.లేని పక్షంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
పార్టీ దిమ్మెలు కూల్చినా.ఆఫీస్ తగలబెట్టినా మునుగోడులో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇటువంటి కుట్రపూరిత చర్యలతో తమ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై తమ కార్యకర్తలను బెదిరించేందుకు కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.