నేటితో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసిపోయింది.హోరా హోరీగా అన్ని పార్టీల నాయకులు ప్రచారాలు నిర్వహించారు.
ప్రత్యర్థులను తిట్టడం .ఓటర్లను ప్రసన్నం చేసుకుని తమ గెలుపుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే పనిలో ఇప్పటి వరకు అన్ని పార్టీల నేతలూ బిజీ బిజీ గా గడిపేశారు.ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మండుటెండల్లో మేయర్ అభ్యర్థులు కార్పొరేటర్ల కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.70 ఏళ్ల వయసు దాటినా, తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహిస్తూ , అధికార పార్టీ వైసీపీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, పనిలో పనిగా ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా రెచ్చగొట్టే ధోరణి లోనూ మాట్లాడుతూ నానా హంగామా సృష్టించారు.చంద్రబాబు ఎన్నికల ప్రచారం తో తెలుగుదేశం పార్టీలో ఎక్కడలేని ఊపు కనిపించింది.ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే, క్షేత్రస్థాయిలో ఈ పార్టీకి బలం లేకపోయినా , గట్టిగానే పంచాయతీ ఎన్నికల్లో స్థానం సంపాదించుకున్నాయి.
ఇప్పుడు అదే ఫార్ములాతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలనే విధంగా జనసేన స్పీడ్ పెంచింది.అయితే ఎక్కడా అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన లేదు.
కేవలం జనసైనికులే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు.అభ్యర్థుల తరఫున ప్రచారానికి దిగుతూ, స్థానికంగా అన్ని ఏర్పాట్లూ చేసుకుంటూ హడావుడి చేస్తున్నారు.
దీంతో పవన్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు రావడం లేదు ? పార్టీ లో ఉత్సాహం నింపే విధంగా ఎందుకు మోటివేషన్ చేయడం లేదు ? అసలు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అనే ప్రశ్నలు ఎన్నెన్నో తెరపైకి వస్తున్నాయి.అయితే నేరుగా పవన్ ప్రచారానికి దిగకుండా, వీడియో ద్వారా తన సందేశం వినిపిస్తూ, సరికొత్త ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
పవన్ వీడియో సందేశాలను జనసైనికులు స్క్రీన్ లపై ప్రదర్శిస్తూ, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు.

అయితే పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయట.ప్రస్తుతం జనసేన అనధికారికంగా కొన్ని చోట్ల టిడిపితో పొత్తు పెట్టుకోవడం తో పాటు , విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై స్పందించాల్సి రావడం, ఎన్నికల ప్రచారం లోకి దిగితే రాజకీయ ప్రత్యర్థులు ఆ అంశంపై తనను ఇరుకున పెట్టే అవకాశం ఉండడం ఇలా ఎన్నో అంశాలతో పవన్ వీడియో సందేశాలు ఇస్తూ, జనసైనికుల్లో జోష్ నింపుతున్నారు.అటు చంద్రబాబు మండుటెండల్లో తిరుగుతూ…ఇటు పవన్ వీడియో సందేశాలతో హడావిడి చేస్తూ, ఈ దఫా మున్సిపల్ ఎన్నికల ప్రచారం సరికొత్తగా నిర్వహిస్తున్నారు.