కూరగాయ పంటలలో ఒకటిగా చెప్పుకునే బెండ ఎక్కువగా ఉష్ణ సమ శీతోష్ణ మండల ప్రాంతాలు ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి.లేత బెండకాయలను కూరగాయగా, బెండ వేర్లను చక్కెర, బెల్లం పరిశ్రమలలో, ముదిరిన కాండం కాయల నుండి తీసిన నారను కాగితపు పరిశ్రమలలో వినియోగిస్తారు.
బెండ సాగుకు హైబ్రిడ్ రకాల కంటే సాధారణ రకాలే వినియోగించడం ఉత్తమం.బెండ సాగులో ప్రధాన సమస్య తెగుళ్లు.
వీటిని అరికట్టితే అధిక దిగుబడి పొందవచ్చు.ఆకులపై బూడిద రంగు వర్ణం, ఆకులు పసుపు రంగులోకి మారడం లాంటివి జరిగితే ఆ పంటకు బూడిద తెగుళ్లు సోకినట్టే.
ఒక లీటర్ నీటిలో గంధకం మూడు గ్రాములు కలిపి ఐదు రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు పిచికారి చేయాలి.
బెండ ఆకులు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారితే పంటను పల్లాకు తెగులు సోకినట్లు నిర్ధారించుకోవాలి.
ఆలస్యంగా పంట వేస్తే పల్లాకు తెగులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.జూలై 15 లోపే విత్తుకోవాలి.
ఇమిడక్లొప్రిడ్ ఐదు గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే పల్లాకు తెగులు వచ్చే అవకాశం చాలా తక్కువ.ఏ మొక్కకు అయితే పల్లాకు తెగులు సోకిందొ ఆ మొక్కను వెంటనే పంట నుండి వేరు చేయాలి.
వ్యవసాయ అధికారులకు పంట చూపించి వారి సలహాతో క్రిమిసంహారక మందులను వినియోగించాలి.
నల్ల రేగడి పొలాలలో పంట వేసేటప్పుడు దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేప పిండి వేసి కలియ దున్నాలి.
అప్పుడు పంటకు ఎండు తెగులు వచ్చే సమస్య ఉండదు.గింజలు మొలికెత్తిన తర్వాత 15 రోజుల లోపు బెట్ట తగిలి చనిపోతే ఎండు తెగులు సోకినట్టు నిర్ధారించుకోవాలి.
లీటరు నీటిలో కాపర్ ఆక్సి క్లోరైడ్ మూడు గ్రాములు కలిపి మొక్కల మొదళ్ల వద్ద పోయాలి.ఐదు రోజులకు ఒకసారి లాగా రెండుసార్లు పోస్తే ఎండు తగల నుండి పంట సంరక్షించబడుతుంది.







