యాదాద్రి జిల్లా:ఆడపిల్లగా పుట్టడమే ఆ పసిగుడ్డు చేసిన పాపమా?ఆడపిల్లకు అయినవాళ్లే పెడుతున్న శాపమా?పుట్టీ పుట్టగానే రోడ్డు ప్రక్కన చెట్ల పొదల్లోకి చేరిన పసికందు.కన్నతల్లి గుండె బండబారిందా? తల్లిదండ్రుల కడుపు తీపి ఆవిరైందా?కన్నప్రేమలేని కసాయి తల్లిదండ్రులను ఏమనాలి?ఈ దారుణానికి పాల్పడిన వారిని ఏం చేయాలి?
యుగం ఏదైనా సమాజంలో ఆడపిల్లకు అడుగడుగునా అన్యాయమే జరిగుతుంది.తల్లి కడుపులో ఉండగానే ఆడపిల్లకు కష్టాలు మొదలై చనిపోయే వరకు నీడలాగా వెంటాడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.కాలాలు మారినా ఆడపిల్ల కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు.కన్న వారి నుండి కట్టుకున్న వాడి వరకు,సమాజంలో ప్రతీ చోటా ఏదో ఒక రకంగా ఆడపిల్ల నిత్యం వివక్షకు గురవుతూనే ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ అనే పదానికి అర్థం మారిపోతుంది.
పుట్టకముందు చంపే వారు కొందరైతే, పుట్టాక కళ్ళు తెరవక ముందే కాటికి పంపే వారు ఇంకొందరు.ఎవరికి వీలైనట్లు వారు ఆడపిల్లపై కక్షగట్టి కసి తీర్చుకునే వారే కనిపిస్తున్నారు.
ఇలాంటి హృదయవిధారక సంఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.తుర్కపల్లి మండలంలోని వెంకటపురం-దత్తాయిపల్లి రోడ్డులో అప్పుడే పుట్టిన ఆడబిడ్డ రోడ్డు ప్రక్కన చెట్ల పొదల్లో కనిపించింది.
కారణాలు ఏమిటో తెలియదు కానీ,ఏ పాపం తెలియని పసికందును ఇలా చెట్ల పొదల్లో పడేసి వెళ్లిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అక్కడే ఉన్న పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు,108 సిబ్బందికి సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు,108 సిబ్బంది చెట్ల పొదల్లో ఉన్న పసి ప్రాణాన్ని బయటికి తీసి భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించి పసికందుకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.
పేగుబంధాన్ని మరిచి,అమ్మతనాన్ని హననం చేసి కన్నతల్లే ఈ పాడు పనికి పాల్పడిందా? లేక ఆ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చి అయినవారే ఈ దారుణానికి వడిగట్టారా? తెలియదు కానీ,పసికందు అనే కనికరం లేకుండా చెట్ల పొదల్లో పడేయడం అందరినీ కలచివేసింది.ఆడ పిల్లలు సైతం అన్ని రంగాల్లో మగవాళ్లకు ధీటుగా ముందుకు వెళుతున్న తరుణంలో కూడా ఆడపిల్లల పట్ల ఇంతటి వివక్ష కొనసాగుతూనే ఉండటం నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిందే.
రక్తం మరకలు ఆరని పసిబిడ్డ అసలు హాస్పిటల్ నుండి ఎలా బయటికి వచ్చిందనేది తేలాల్సి ఉంది.పసిపిల్లల పట్ల పాశవికంగా ప్రవర్తిస్తున్నది ఎవరైనా సరే అత్యంత కఠినగా శిక్షిస్తే తప్ప ఈ దారుణాలకు అడ్డుకట్ట వేయలేమని సామాజిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







