ఏపీ టీడీపీలో అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.పార్టీ అభ్యర్థుల విషయంలో కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు.
టీడీపీలో ఇదివరకు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు రెండు ఆ పై టికెట్లు పొందేవి.ప్రస్తుతం ఆ విధానాన్ని మారుస్తూ ఒకే సీటుకి పరిమితం చేయాలని చూస్తున్నారు.
ఎందుకంటే.పార్టీలో ఎప్పటినుంచో పనిచేస్తూ వస్తున్న ఆశావహుల నుంచి వ్యతిరేకత రాకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు.
అయితే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పేరున్న సీనియర్ నేతలు తమ తమ కుటుంబాల తరఫున సీట్లు తీసుకొని రెండు నియోజకవర్గాలనుంచి పోటీ చేసేవారు.కానీ ఇకనుంచి ఆ ఫార్ములాను చంద్రబాబు పక్కన పెట్టబోతున్నారు.
ఎంతటి రాజకీయ ఘనమైన వారసత్వం ఉన్నా.చరిత్ర ఉన్నా కుటుంబానికి ఒక్కటే సీటును కేటాయించబోతున్నారు.
ఈ నిర్ణయాన్ని సీనియర్ నేతలకు సైతం ఇప్పటికే చెప్పేసినట్లు తెలుస్తోంది.
ప్రతి జిల్లాలోనూ సీనియర్ నేతలు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోను సీనియర్ నేతలు పలువురు తాము పోటీచేయడమే కాకుండా తమ తమ్ముడో, కుమార్తె, కుమారుడు, బావమరిది, అల్లుడు… ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున పోటీచేసుకుంటూ వస్తున్నారు.
దీనివల్ల ఆశావహులకు, పార్టీ టికెట్ కోసం ఎదురుచూసేవారికి తీవ్ర నిరాశే మిగులుతోంది.దీంతో పార్టీలో వ్యతిరేకత పెరుగుతోందని చంద్రబాబు భావించి కుటుంబానికి ఒకే టికెట్ కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

రాబోయే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకం కాబట్టి లోటుపాట్లు ఎక్కడున్నా వాటిని సరిజేసుకుంటూ వస్తున్నారు.దివంగత ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి ప్రస్తుతం చట్టసభలకు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రామ్మోహన్ నాయుడు ఎంపీగా, అచ్చన్నాయుడు, ఆదిరెడ్డి భావానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె అదితి గజపతిరాజు ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీచేశారు.కళా వెంకట్రావు, ఆయన బంధువు కిమిడి మృణాళిని, అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్, జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, వారి ఇద్దరు కుమారులు, చిత్తూరు జిల్లా నుంచి ఆదికేశవులనాయుడి కుటుంబం, అమర్నాథ్‌రెడ్డి కుటుంబం, కర్నూలు జిల్లా నంచి భూమా కుటుంబం, కోట్ల కుటుంబం, కేఈ కుటుంబం.ఇలా అందరూ రెండు సీట్లు తీసుకుంటున్నారు.
అయితే ఇకనుంచి ఈ కుటుంబాలకు ఒక సీటే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… వీరిలో బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు.
మరి వీరి విషయంలో కూడా ఒకే సీటు ఫార్ములా పాటిస్తారా.? లేక గెలుపు గుర్రాలుగా ఉన్నవాళ్లకు సీట్లు కేటాయిస్తారా…వేచి చూడాల్సిందే.