అత్యున్నతమైన పురస్కారాల (అవార్డులు) మీద యోగా గురు బాబా రామ్‌దేవ్ వివాదం రేపారు.ఇది సామాన్య జనం అప్పుడప్పుడు మాట్లాడుకునే విషయమే అయినా బాబా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇంతకూ రామ్‌దేవ్ ఏ అవార్డుల గురించి మాట్లాడారు? ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిభావంతులకు, వివిధ రంగాల్లో కృషి చేసినవారికి ఇచ్చే ‘పద్మ’ (పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్) అవార్డులు కొందరు లాబీయింగ్ ద్వారా సొంతం చేసుకుంటున్నారని రామ్‌దేవ్ వ్యాఖ్యానించారు.ఈ అవార్డులు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రదానం చేస్తున్న ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి సైతం లాబీయింగ్ ద్వారా కొందరు తీసుకుంటున్నారని అన్నారు.
అర్హులైనవారికి కొందరికి పద్మ అవార్డులు ఇస్తున్నా, ఎక్కువమందికి రాజకీయాల కారణంగానే అవార్డులు వ స్తున్నాయని చెప్పారు.నోబెల్ బహుమతి విషయంలో ఎంతవరకు లాబీయింగ్ జరుగుతోందో చెప్పలేంగాని, పద్మ అవార్డుల విషయంలో రాజకీయాలు బాగా పనిచేస్తాయనే అభిప్రాయం జనంలో ఉంది.
కొందరికి పద్మ అవార్డుల ప్రదానం వివాదాస్పదమైన సందర్భాలూ ఉన్నాయి.దేశంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన చాలామందికి పద్మ అవార్డులు రాలేదు.భారతరత్న పురస్కారం కూడా అర్హులకు ఇవ్వడంలేదనే అభిప్రాయం ఉంది.సినిమా అవార్డులు, పద్మ అవార్డుల విషయంలో ప్రతి ఏటా వివాదాలు వస్తూనే ఉంటాయి.
చాలామంది బహిరంగంగానే ప్రకటనలు చేస్తుంటారు.కాకపోతే రామ్‌దేవ్ నోబెల్ బహుమతిని కూడా లాబీయింగ్‌లో చేర్చారు.
ఇది ఎలాంటి లాబీయింగో ఆయనే వివరించాలి.రామ్‌దేవ్‌కు, మరో యోగా గురు, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్‌కు ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించగా వారు తిరస్కరించారు.
ఆధ్యాత్మిక రంగంలోనివారికి అవార్డులు అనవసరమన్నారు.







