చిత్రం : అ ఆ బ్యానర్ : హారిక & హాసిని క్రియేషన్స్ దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత : ఎస్ .రాధకృష్ణ సంగీతం : మిక్కి జే మేయర్ విడుదల తేది : జూన్ 2, 2016నటీనటులు : నితిన్, సమంత, రావు రమేష్, నదియా , నరేష్ , అనుపమ పరమేశ్వరన్ తదితరులు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో , హారిక & హాసిని పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన మూడోవ చిత్రం అ ఆ.సన్నాఫ్ సత్యమూర్తి రూపంలో యావరేజ్ అందుకున్నారు త్రివిక్రమ్ .నితిన్ గత చిత్రం కొరియర్ బాయ్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది .ఇక సమంత గత చిత్రం బ్రహ్మోత్సవం డిజాస్టర్ గా నిలిచింది .ఈ నేపథ్యంలో వచ్చిన అ ఆ ఎలా ఉందో , ఈ ముగ్గురి కెరీర్ లో ఈ సినిమా ప్రాముఖ్యత ఏంటో చూద్దాం .
కథలోకి వెళ్తే …
హైదరాబాద్ మహానగరంలో ఓ ధనవంతురాలు మహాలక్ష్మి (నదియా).ఈవిడ భర్త పేరు రామలింగం (నరేష్).వీరిద్దరికీ ఓ కూతురు అనసూయ (సమంత).ఇంట్లో అంతా మహాలక్ష్మి పెత్తనమే నడుస్తూ ఉంటుంది .భర్త అయినా, కూతురు అయినా, తన మాట వినాల్సిందే .ప్రతి చిన్న విషయంలో తల్లి కలుగజేసుకోవటం వలన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతలేకపోతుంది అనసూయ.చివరకి నిరాశలో ఆత్మహత్య చేసుకోవడానికి విఫలయత్నం చేస్తుంది .కూతురి పరిస్థితిని చూడలేని తండ్రీ ఓ పదిరోజులు కొత్తగాలి కోసం ఓ పల్లెటూరిలో ఉంటున్న మేనమామ దగ్గరికి అనసూయని పంపిస్తాడు .అక్కడ తన బావ ఆనంద్ విహారి (నితిన్) తో బాగా కలిసిపోతుంది అనసూయ.ఇన్నిరోజులు తల్లి పెంపంకంలో జైలులో ఉన్నట్లు గడిపిన అనసూయకి, ఆ ఊరి వాతావరం కొత్తగా, ఉల్లాసంగా ఉంటుంది .అదే ఊర్లో వెంకన్న (రావు రమేష్), నాగవల్లి (అనుపమ) కూడా ఉంటారు.
ఆ ఊరి మనుషులతో అనసూయ పెంచుకున్న బంధం ఎలాంటిది ? పదిరోజులు గడిపిన తరువాత అనసూయ ప్రపంచంలో ఏమైనా మార్పులు వచ్చాయా? ఆనంద్ విహారితో అనసూయ అనుబంధం అక్కడినుంచి ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మిగితా కథ .
నటీనటుల నటన గురించి :
నితిన్ నటనలోని కొత్తకోణం ఈ సినిమాలో చూడొచ్చు .నితిన్ మేకోవర్ నుంచి డైలాగ్ డెలివరి వరకు, కొత్త పంథాలో నడిపించాడు దర్శకుడు .ఫ్యామిలి ఆడియెన్స్ లో నితిన్ కి ఈ సినిమా మంచి మైలేజ్ ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అవసరం లేదు .ఇక సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .ఏమాత్రం అనుమానం లేకుండా , ఇది సమంత కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు .ఈ జెనరేషన్ లో సమంత తప్ప, మరో కథానాయిక ఈ పాత్రను ఇంత అవలీలాగా పోషించలేదేమో .ఇక రావురమేష్ దర్శకుడితో పాటు, తన పాత్రతో పాటు , తన నటనాశైలిని మార్చుకుంటూ వెళుతున్నారు .పతాక సన్నివేశాల్లో అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది కూడా ఈయనే .ఇక అనుపమ అందంగా ఉన్న, మేకప్ కాస్త ఎక్కువైపోయిందని చెప్పాలి .
సాంకేతికవర్గం పనితీరు :
మిక్కి జే మేయర్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది .నేపథ్య సంగీతం కూడా బాగుంది .ఇక ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వహించిన నటరాజన్ సుబ్రహ్మణ్యం గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి .పల్లెటూరి వాతావరణాన్ని ఆయన చిత్రీకరించిన తీరు చూస్తే, వెంటనే మరి ఊరిని చూడాలనిపిస్తుంది .ఇక దర్శకుడిగా త్రివిక్రమ్ చాలాకాలం తరువాత మంచి మార్కులు సంపాదించుకున్నారు.స్క్రీన్ ప్లే చాలా సూటిగా, క్లుప్తంగా ఉంది.
ఆయన రాసిన మాటలు కూడా ఎప్పటిలాగే బాగున్నాయి .మేకప్ విభాగం మీదే కాస్త ఎక్కువ శ్రద్ధ కనబరిస్తే బాగుండేది .పాటలు సందార్భానికి తగ్గట్టుగా పెట్టడంలో త్రివిక్రమ్ సఫలమయ్యారు.
విశ్లేషణ:
హీరోకన్నా, హీరోయిన్ క్యారెక్టర్ మీద ఎక్కువ లాగిన సినిమా ఇది.అందుకేనేమో, కొంతమంది హీరోలు ఈ సినిమాని తిరస్కరించినట్లుగా వార్తలు వచ్చాయి .కాస్త లోతుగా పరిశీలిస్తే బొమ్మరిల్లు కథను పోలి ఉన్న చిత్రం ఇది.అందులో తండ్రీకొడుకుల మధ్య ఉన్న బంధం, సమస్యే, ఇంచుమించు అదేరకంగా, తల్లికూతుళ్ళ నడుమ కనిపిస్తూ ఉంటుంది.ఫస్టాఫ్ ఎలాంటిది సమస్య లేకుండా ప్రేక్షకుడిని రంజింపజేసిన త్రివిక్రమ్, సెకండాఫ్ లో మాత్రం కాస్త పట్టు వదిలేసారు.
కాస్త ఆలస్యమైనా, క్లయిమాక్స్ లో పుంజుకున్న సినిమా, ప్రేక్షకుడికి ఓ సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది.
త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే కామేడి ఈ చిత్రంలో కూడా ఆశిస్తే నిరాశాపడటం ఖాయం.
సెకండాఫ్ లో చాలా సన్నివేశాలు వదులుగా, అనాసక్తికరంగా ఉండటం బాధాకరం.అయితే పతాక సన్నివేశాలు చాలా బాగారావటంతో ఆ నిరాశ కూడా మరచిపోతాం.
మొత్తం మీద మంచి ఫ్యామిలి ఎంటర్టైనర్ ఈ చిత్రం.ఏ సెంటర్లలో మంచి రెస్పాన్స్ రావడం ఖాయం.
మాస్ సెంటర్లలో ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరం .
హైలైట్స్ :
* ఫస్టాఫ్ * సమంత* సంధర్భానికి తగ్గట్టు పాటలు * పతాక సన్నివేశాలు* కుటుంబ ప్రేక్షకులని ఆకట్టుకునే సన్నివేశాలు
డ్రాబ్యాక్స్ :
* సెకండాఫ్ * ఆకట్టుకోని కామెడి * త్రివిక్రమ్ మార్కు లేని సంభాషణలు
చివరగా :
చూడదగ్గ ఫ్యామిలి ఎంటర్టైనర్
తెలుగుస్టాప్ రేటింగ్ : 3/5