సమగ్ర విద్యతోనే జీవితాల్లో వెలుగులు నింపొచ్చు.నాగరికతకు విద్యే కొలమానం.
అది విశ్వసించే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.నీతి అయోగ్ గణాంకాల ప్రకారం దేశంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న 112 జిల్లాల జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ స్థానంలో నిలవడం పట్ల హర్షం చేసి జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి అజయ్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందన్నారు.పరిపాలన వికేంద్రీకరణ, ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన గొప్ప ఫలితాలను అందజేస్తుందన్నారు.
జిల్లాల ఏర్పాటు అనంతరం ఒకొక్కటిగా సౌకర్యాలను చేకూర్చుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
నూతన జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం నేడు అభివృద్థి పథంలో దూసుకెళ్తుందన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కేటగిరిలో వందలాది గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు.నాణ్యమైన భోజనం, నాణ్యమైన బోధనలతో తెలంగాణ గురుకులాలు నేడు సంచలనాలు సృష్టిస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో విద్యాయజ్ఞం కొనసాగుతున్నదని ఇందులో భాగంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.దేశానికే మార్గదర్శకంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం సంస్కరణ దిశలో సాగుతుందని తెలిపారు.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పిరేషనల్ జిల్లాగా నిలిచినట్టు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ప్రకటించిన విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు.







