శాంతి చర్చలకు సిద్ధం…కానీ….: మావోయిస్టులు
చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు మావోయిస్టులు.ముఖ్యంగా ప్రభుత్వం అరెస్టు చేసిన మావోయిస్టు నేతలను విడుదల చేయాలని, ఘర్షణలకు కారణమవుతున్న ప్రాంతాల్లో భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలని కోరారు.కాగా, ఎలాంటి షరతులు లేకుంటేనే, చర్చలు జరుగుతాయని రాష్ట్ర మంత్రి ఇటీవల ప్రకటించారు.
రాజ్యాంగం మీద విశ్వాసం ఉంటే మావోయిస్టులతో శాంతి చర్చలకు సిద్ధమని నెల రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భాఘెల్ ప్రకటించారు.మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో చత్తీస్‌ఘడ్ ఒకటి.
మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ, మావోయిస్టు ప్రాంతాల్లో సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది.దీంతో సీఎం తీరును మావోయిస్టులు విమర్శిస్తున్నారు.
ఒకవైపు చర్చలకు సిద్ధం అంటూనే, మరోవైపు ఎయిర్ స్ట్రైక్స్ చేయడమేంటని, ఇది సీఎం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మావోయిస్టులు విమర్శించారు.ఎయిర్ స్ట్రైక్స్ ఎవరు చేయమన్నారో సీఎం స్పష్టం చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.
ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు.ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించినప్పుడే చర్చలు సాధ్యమవుతాయని మావోయిస్టులు స్పష్టం చేశారు.