ఎలుగుబంట్లు గురించి అందరికీ తెలిసినదే కానీ, వాటి జీవన శైలిమీద మాత్రం పెద్దగా ఎవరికీ అవగాహన ఉండదు.ఎవరో అరకొర జూ నిర్వాకులకు తప్ప వాటి గురించి అందరికీ అనుభవం ఉండదు.
వాటి పిల్లలపై అవి అపారమైన ప్రేమను చూపుతాయి.అవి పిల్లల లాలనలో వున్న సమయంలో పులినైనా సరే ఎదిరించి దాడికి తెగబడతాయి.
పిల్లలపై వాటి వాత్సల్యం అమోఘం.అయితే కంగారుల్లాగా తన సంతానాన్ని నిత్యం కంటికిరెప్పలా చూసుకుంటూ వెంట పెట్టుకుని తిరిగే ఈ భల్లూకాలు అంతరించిపోతున్న జీవుల్లో ఉండటం విచారకరం.
ఇక ఎలుగు బంట్లలో అనేక రకాల జాతులున్నప్పటికీ ముఖ్యంగా స్లాత్‌బేర్‌గా పిలువబడే తెల్లమూతి నల్ల ఎలుగు బంటి గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి.భారత ఉపఖండమంతా జీవిస్తున్న ఓ మాంసాహార క్షీరదం ఇది.అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జీవించ గలిగే ఎలుగుబంటి నల్లమల కీకారణ్యంలోనూ , అనంతపురం జిల్లాలోని బోడి కొండల్లోనూ ఉన్నాయి.అయినప్పటికీ వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం జంతు ప్రేమికులను కలవరపెడుతోంది.
తన పిల్లలను రక్షించుకునేందుకు ఎదురు పడిన జీవిని చంపేంత ప్రమాదకారి ఈ ఎలుగుబంటి.

ఎలుగుబంటికి చాలా ఆవేశం ఎక్కువ.పిల్లల మీద ఉండే అపారమైన ప్రేమ, జాగురూకత వలన అది పిల్లలతో సంచరించేటప్పుడు జంతువైనా, మనిషి అయినా ఎదురైతే ఎలాంటి శషభిషలు లేకుండా దాడి చేస్తుంది.ఇక అడవుల్లో విధులు నిర్వహించే అటవీ సిబ్బంది కూడా ఎలుగుబంటి దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు.
తన పిల్లలను నిత్యం తన వీపుపై మోస్తూ తిరగడం ఎలుగుబంటి ప్రత్యేక లక్షణం.ఇది ఇతర వన్యప్రాణుల్లో అంతగా కనిపించదు.కోతులు మాత్రమే పిల్ల కోతులను పొట్టకు కరిపించుకు మోస్తుంటాయి.








