వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఆశయం కావొచ్చు.
ఆర్ధిక సమస్యలు కావొచ్చు.కారణమేదైనా పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరిగిందని అనేక గణాంకాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో అక్కడ జాత్యహంకార దాడులు, రోడ్డు ప్రమాదాలు, ఇతర చిక్కుల్లో పడి కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.పని ప్రదేశాల్లో జరిగే హింస దీనికి అదనం.
ఈ నేపధ్యంలో విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల శ్రేయస్సుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.
దీనిలో భాగంగా సామాజిక భద్రతా ఒప్పందాల ఛత్రం కిందకి భారతీయులను తీసుకురావాలని భావిస్తోంది.
ఇందుకోసం త్వరలో జరగనున్న జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్ఓ)ను వినియోగించుకోనుంది.ఈ సదస్సుకు భారత్ నుంచి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సహా సభ్య దేశాల కార్మిక శాఖ మంత్రులు హాజరుకానున్నారు.
దీనిపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులను సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకురావడానికి మరిన్ని దేశాలతో మనదేశం చర్చలు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు ఫ్రేమ్‌వర్క్ కార్యాచరణ కింద సంబంధిత విదేశీ ప్రభుత్వాలు భారతీయ ప్రవాస కార్మికుల ప్రావిడెంట్ ఫండ్స్ ఖాతాలకు సంబంధించిన వివరాలను కేంద్రానికి అందించాయి.
కార్మిక చట్టం ప్రకారం సామాజిక భద్రతా వలయం కింద ప్రవాస కార్మికులను కవర్ చేయడానికి ఇది వెసులుబాటు కల్పిస్తుంది.ఇప్పటి వరకు కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, నార్వే, స్విట్జర్లాండ్ , ఫ్రాన్స్ సహా 19 దేశాలతో భారత్ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకుంది.
బ్రెజిల్‌తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ.ఇంకా ఇది అమల్లోకి రాలేదు.