గర్భస్థ లింగ నిర్ధారణ, గర్భస్రావం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని 45 వార్డులోని సంజీవిని హాస్పిటల్ లో అబార్షన్లు చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేసి సీజ్ చేశారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 5 రోజుల క్రితం నూతనకల్ మండలానికి చెందిన ఆరు నెలల గర్భవతి (24)ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని గర్భస్రావం చేశారని,ఆమెకు మొదటి సంతానం ఒక కూతురు ఉండగా,రెండో సంతానం కూడా ఆడపిల్ల కావడంతో అబార్షన్ చేసినట్లు తెలిసిందన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలానికి చెందిన మరో ఐదు నెలల గర్భవతి అబార్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని,ఆమెకు గ్లూకోజ్ ఉండడంతో అనుమానం వచ్చి అడగగా అబార్షన్ కోసం వచ్చానని చెప్పిందన్నారు.
గర్భస్రావం,లింగ నిర్ధారణ పరీక్షలు చేసినవారికి రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు, చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని స్కానింగ్ సెంటర్ల పైన,ఆసుపత్రులపైన నిరంతరం తనిఖీలు ఉంటాయని తెలిపారు.
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆస్పత్రులను సీజ్ చేయడం,పోలీస్ కేసులు కూడా నమోదు చేశారని అన్నారు.అబార్షన్ చేసిన అమ్మాయికి ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు.