నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
అలాగే వైసిపి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.అంతేకాకుండా తాను వైసీపీని వీడుతున్నాను అని, 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించుకున్నారు.
శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై వైసీపీలో ప్రకంపనాలు చోటు చేసుకోగా, టిడిపి నెల్లూరు జిల్లా నేతలు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు.ముఖ్యంగా నెల్లూరు జిల్లా టిడిపిలో సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర , నెల్లూరు రూరల్ టిడిపి ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో సైలెంట్ అయిపోయారు.

మొన్నటి వరకు శ్రీధర్ రెడ్డి విషయంలో వీరంతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఈయన విషయంలో సైలెంట్ గా ఉండడం ఆసక్తికరంగా మారింది.వైసీపీ నుంచి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పార్టీలో చేరితే వారికి మద్దతుగా మాట్లాడడం, వారికి జైజైలు కొట్టడం సర్వసాధారణం.కానీ శ్రీధర్ రెడ్డి విషయంలో నెల్లూరు జిల్లా టిడిపి నేతలు మౌనంగా ఉంటున్నారు.దీనికి కారణం శ్రీధర్ రెడ్డి 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ఆయనకు ఆయనే టికెట్ ప్రకటించుకోవడమే కారణమట.
కనీసం టిడిపి అధినేత చంద్రబాబు శ్రీధర్ రెడ్డి విషయంలో ఏ ప్రకటన చేయలేదు.ఆయనకు ఎటువంటి హామీ ఇవ్వలేదు.అయినా ఆయనకు ఆయనే తానే అభ్యర్థినంటూ ప్రకటించుకోవడం నెల్లూరు టిడిపి నేతలకు మంట పుట్టిస్తోందట.

ఒకవేళ శ్రీధర్ రెడ్డిని టిడిపిలో చేర్చుకున్నా, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకున్నా, ముందుగా నెల్లూరు రూరల్ టిడిపి నాయకులతోనూ, అక్కడి పార్టీ ఇంఛార్జి తోనూ చంద్రబాబు మాట్లాడతారని, ఆయన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే శ్రీధర్ రెడ్డి కి టికెట్ కన్ఫర్మ్ చేస్తారని, కానీ అవేమీ జరగకుండా శ్రీధర్ రెడ్డి టికెట్ ప్రకటించుకోవడం పై తెలుగు తమ్ముళ్ల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.నిన్నా, మొన్నటి వరకు శ్రీధర్ రెడ్డి తమపై అనేక కేసులు పెట్టి వేధింపులు గురి చేశారని, ఇప్పుడు ఆయన్నే తాము భుజాలకి ఎత్తుకుని మోయాలంటే ఎలా అంటూ నెల్లూరు తెలుగు తమ్ముళ్లు అంతర్గత చర్చల్లో వాపోతున్నారట.
