ఇటీవల న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన ఎరిక్ ఆడమ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.176 ఏళ్ల నగర చరిత్రలో తొలిసారిగా ఓ మహిళను పోలీస్ కమీషనర్‌గా నియమించారు.ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.మంగళవారం ఎరిక్ ఆడమ్స్ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ.నసావు కౌంటీ పోలీస్ చీఫ్ ఆఫ్ డిటెక్టివ్స్‌గా వ్యవహరిస్తోన్న కీచాంట్ సెవెల్‌ను నగర పోలీస్ కమీషనర్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించారు.ఈమె ప్రజలకు భద్రతను, న్యాయాన్ని అందించగల సమర్థురాలని ఆడమ్స్ అన్నారు.
49 ఏళ్ల సెవెల్ .డెర్మోట్ షియా స్థానంలో జనవరి 1న న్యూయార్క్ నగర పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.తన ప్రచార సమయంలోనే ఎరిక్ ఆడమ్స్.న్యూయార్క్ పోలీస్ కమీషనర్‌గా ఒక మహిళను నియమిస్తానని హామీ ఇచ్చారు.ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఇచ్చిన మాట ప్రకారం.ఆ మేరకు కసరత్తు చేశారు.
సీటెల్ మాజీ చీఫ్ కార్మెన్ బెస్ట్, ఫిలడెల్ఫియా కమీషనర్ డేనియల్ అవుట్‌లా, మాజీ నెవార్క్ చీఫ్ ఇవోన్నే రోమన్, ఎన్‌వైపీడీ చీఫ్ ఆఫ్ పెట్రోల్ జువానిటా హోమ్స్ పేర్లు కమీషనర్ రేసులో వినిపించాయి.వారందరినీ కాదని సెవెల్ వైపు ఆడమ్స్ మొగ్గు చూపారు.
క్వీన్స్‌కు చెందిన సెవెల్.న్యూయార్క్ పోలీస్ శాఖకు సారథ్యం వహిస్తోన్న మూడవ నల్లజాతి వ్యక్తి.
అంతకుముందు బెంజమిన్ వార్డ్, లీ బ్రౌన్‌లు కమీషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

కాగా.దేశంలోనే అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరానికి తదుపరి మేయర్‌గా మాజీ పోలీస్ అధికారి, డెమొక్రటిక్ నేత ఎరిక్ ఆడమ్స్ గత నెలలో ఎన్నికైన సంగతి తెలిసిందే.తద్వారా న్యూయార్క్ నగరానికి సారథ్యం వహించనున్న రెండో ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆడమ్స్ రికార్డుల్లోకెక్కారు.ఎరిక్ ఆడమ్స్ కంటే ముందు డేవిడ్ డింకిన్స్ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి వ్యక్తి.1990 నుంచి 1993 వరకు ఆయన మేయర్‌గా విధులు నిర్వర్తించారు.2006లో ఆడమ్స్ న్యూయార్క్ పోలీస్ శాఖ నుంచి పదవీ విరమణ పొందారు.అనంతరం రాజకీయాలలోకి ప్రవేశించి న్యూయార్క్ సెనేట్‌కు ఎన్నికై 2013 వరకు పనిచేశాడు.







