తెలంగాణాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లను పూర్తిగా గులాబీ పార్టీయే గెలుచుకోవాలని ముఖ్యమంత్రి కెసీఆర్ పట్టుదలగా ఉన్నారు.12 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ అన్ని సీట్లను గులాబీ పార్టీ మాత్రమే కైవసం చేసుకునేలా కృషి చేయాలని కెసీఆర్ పార్టీ నాయకులకు నూరిపోశారు.శాసన మండలిలో ప్రతిపక్షాలకు స్థానం లేకుండా చేయాలని కెసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందానికి రావాలని అనుకున్నారు.కానీ ఆ తరువాత ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో బంపర్ మెజారిటీ సాధించి ఎన్నడూ లేని విధంగా మంచి ఊపులో ఉన్న కెసీఆర్ మండలిలో గులాబీ హవా మాత్రమే వీచాలని అనుకుంటున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను చావు దెబ్బ కొడితే, గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో తన పార్టీకి తిరుగు ఉండదని భావిస్తున్నారు.
మండలి ఎన్నికల్లో విజయం సాధించడానికి అభ్యర్థులు ఎవరికీ వారే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కెసీఆర్ చెప్పారు.కెసీఆర్ అనుకున్నట్లు మొత్తం సీట్లు గెలిస్తే ప్రతిపక్షాలకు రాష్ట్రంలో స్థానం ఉండదనే చెప్పుకోవాలి.







