“సాటి మనిషికి సాయం అందించడాన్ని మించిన సత్కార్యం మరొకటి ఉండదు…”ఈ మానవధర్మాన్ని పాటించగలిగినపుడే నిజమైన సమాజనిర్మాణం జరుగుతుంది.అలాంటి ఒక సమసమాజ నిర్మాతగా తమ బిడ్డ నిలవాలని బహుశా అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు.
కానీ, ఒక తండ్రి ఈ దిశగా మరో ముందడుగేశారు.తన గారాలపట్టి ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన ఆనందక్షణాలనే ఆ ఆశయానికి ముహూర్తబలంగా మార్చివేశారు.2013 ఆగస్ట్ 30… చిన్నారి కలశ, తల్లి గర్భం నుండి భూమాత ఒడి చేరిన సుదినం.ఆ క్షణాన, కలశ తండ్రి నాయుడు గారు అందరిలా స్వీట్లు పంచలేదు.
కలశ నాయుడు ఎలా ఉండా లి అని, తను కన్న కలలకు ప్రతిరూపంగా ‘కలశ ఫౌండేషన్’ కు అంకురార్పణ చేసి, కలశ చిన్నారి చేతుల్లో పెట్టారు.తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ బుడిబుడి అడుగుల ప్రాయం నుండే తన చేతిలో ఉన్న చాక్లెట్లు, పుస్తకాలు మొదలుకుని, కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బుల వరకు… అన్నీ అవసరంలో ఉన్న సాటివారితో పంచుకోవడం మొదలుపెట్టింది కలశ నాయుడు.
‘అక్షర కలశం’ పేరిట వందలాది మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఎడ్యుకేషనల్ కిట్స్ అందించినా, పలు రంగాలలో ప్రతిభ కనపరచిన మహిళామణులను గుర్తించి ‘మార్వలెస్ మహిళా అవార్డు’ పురస్కారాలతో సత్కరించినా, మానవాళి జీవనాధారమైన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో మన భాద్యతను గుర్తుచేసేలా ‘గ్రీన్ రన్’ కార్యక్రమాన్ని నిర్వహించినా, ప్రముఖులను ఆహ్వానించి చిన్నారులకు వినోద, విజ్ణానాలను పంచిపెట్టినా, అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించినా, ప్రతిష్టామక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రచారం చేబూనినా… రోగులకు సేవలందించినా, రోడ్లు మరమ్మత్తులు చేసినా, బుల్లితెర ప్రముఖులను పురస్కరించి ప్రోత్సాహం అందించినా, సినీ మాధ్యమం ద్వారా సామాజిక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా… కలశ నాయుడు మరియు కలశ ఫౌండేషన్(Kalasha Foundation) ల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే… అదే సామాజిక సేవ.
అప్రతిహతంగా గత పది సంవత్సరాలుగా పలు రంగాలలో, ఏ ఒక్క చోటుకి పరిమితం కాకుండా దేశాలు, ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు మరియు విశ్వమానవసేవలో మమేకమవుతూ చిన్నారి కలశ నాయుడు ప్రదర్శించిన కఠోర శ్రమ మరియు నిబద్ధతలు, లెక్కకు మించిన అవార్డులు మరియు రివార్డులను సాధించి పెట్టాయి.కలశ నాయుడు ప్రతిభ స్వదేశంలోనే కాకుండా ప్రపంచదేశాల అగ్రసంస్థలు సైతం గుర్తించాయి.చిన్నారి కలశ నాయుడు ప్రజాసేవా రంగంలో కనబరచిన అత్యుత్తమ సేవలకు గాను, యూ.ఎన్.జీ.పీ మరియు యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా తనను “గౌరవ డాక్టరేట్” పురస్కారంతో సత్కరించడం జరిగింది.వెస్ట్ మినిస్టర్స్ ప్యాలస్ లేదా హౌస్ ఆఫ్ లార్డ్స్ అని పిలుచుకునే లండన్ నగరంలోని లండన్ పార్లమెంట్ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది.
అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో చిన్నారి కలశ నాయుడు “ప్రపంచవ్యాప్తంగా అతిపిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలి”గా (గ్లోబల్లీ యంగెస్ట్ సోషల్ వర్కర్) గుర్తింపు కూడా సొంతం చేసుకున్నారు.యూకే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, లండన్ నగర మేయర్, పార్లమెంట్ సభ్యులు మరియు గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్ వంటి అతిరథ మహారథులు ఈ సత్కార మహోత్సవంలో భాగమయ్యారు.
బ్రిటీష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు ఆసీనులైన ప్రముఖులను ఉద్దేశించి, చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు ప్రసంగించడం జరిగింది.అలాగే, లండన్ పార్లమెంట్ లో ఆహుతులైన అతిరథ మహారథుల సమక్షంలో, చిన్నారి కలశ నాయుడు గురించి రెండు నిమిషాల నిడివి గల ఒక ఆడియో-విజువల్ ప్లే చెయ్యడం కూడా జరిగింది.అతి ముఖ్యమైన ఒక పార్లమెంట్ క్వశ్చన్ అవర్ లో భాగం కావలసి వచ్చినందున, గ్రేట్ బ్రిటన్ ప్రధాని శ్రీ రిషి సునక్ ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయారు.గ్రేట్ బ్రిటన్ ప్రధాని, శ్రీ రిషి సునక్, వ్యక్తిగతంగా చిన్నారి కలశ నాయుడును తనతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించడం జరిగింది.
గ్రేట్ బ్రిటన్ ప్రధాని, శ్రీ రిషి సునక్ తన వ్యక్తిగత ఆహ్వానంలో, “చిన్నారి కలశ నాయుడు కనబరచిన అత్యద్భుతమైన ప్రతిభ మరియు ప్రపంచవ్యాప్తంగా అందించిన సమాజ సేవకు గాను ఈ పురస్కారం ఒక గుర్తింపు.పలు దేశాలలో, ఎన్నో రంగాలలో సేవలు అందించడంలో, చిన్నారి కలశ నాయుడి కఠోర శ్రమ మరియు నిబద్ధతలను గుర్తించి, గౌరవించుకునే ఒక సదవకాశం.
ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయం.ఈ పురస్కారం తనకు మేము అందించే గౌరవం.విశ్వమానవసేవలో ఈ చిన్నారి అత్యున్నత శిఖరాలను అందుకోవాలని ఆశిస్తున్నాను.నేను ఈ కార్యక్రమంలో ఒక భాగమయినందుకు వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నాను.మిస్ కలశ నాయుడిని నాతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ పంచుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను మరియు తన అత్యద్భుత సేవలు మరియు ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం అందిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
చిన్నారి కలశ సాధించిన ఈ అపురూప విజయం, కేవలం తన తల్లిదండ్రులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మరియు యావద్భారతదేశానికే ఈ విజయం గర్వకారణం.విశ్వమానవ సేవలో చిన్నారి కలశ నాయుడు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తన తల్లిదండ్రులకు మరియు, మాతృదేశానికి గొప్ప పేరు సాధించిపెట్టాలని ఆశిద్దాం.