వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ విధానానికి జనసేన సంపూర్ణ మద్దతు... పవన్ కళ్యాణ్

దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల ఎన్నో సానుకూలతలు వేల కోట్ల ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట భద్రతా బలగాలు దేశ రక్షణపైనే దృష్టి నిలుపుతాయి “వన్ నేషన్ – వన్ ఎలక్షన్( One Nation One Election )’ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనను జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, మద్దతు తెలుపుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు.ఈ అంశంపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గారి అధ్యక్షతన కమిటీ వేయడం శుభ పరిణామం అన్నారు.

 Jana Sena Fully Supports 'one Nation - One Election' Policy Pawan Kalyan, One N-TeluguStop.com

శుక్రవారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతూ “రాజ్యాంగ దినోత్సవం అయిన నవంబర్ 26న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ దేశమంతటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నామని, దీనిపై ప్రజలు కూడా చర్చించాలని పేర్కొన్నారు.అప్పటి నుంచి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.

జమిలి ఎన్నికలు దేశానికి కొత్తకాదు.స్వాతంత్ర్యానంతరం 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో దేశమంతటికీ ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

తరువాత రాజకీయ పరిణామాల క్రమంలో ఈ సంప్రదాయం కొనసాగించలేకపోయారు.దీనివల్ల దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరగడం నిత్యకృత్యంగా మారిపోయింది.

దీంతో ఎన్నికల నిర్వహణపైనే ప్రభుత్వాలు, పాలకులు దృష్టి నిలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగంలాంటి అంశాలతోపాటు ఆర్థిక అభివృద్ధి, విద్యావ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాలపై దృష్టి నిలిపేందుకు అవకాశం లేకుండా పోయింది.

ప్రజల దృష్టి ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల మీదనే ఉండిపోవడంతో ప్రజా ఉన్నతికి సంబంధించిన అంశాలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టడానికి ఇదో కారణంగా నిలిచింది.దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజల చర్చ పూర్తిగా దేశాభివృద్ధి గురించే జరుగుతుంది.

దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన కేంద్ర భద్రతా బలగాలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఎన్నికల విధుల్లోనే ఉండిపోతున్నాయి.ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా భద్రతా బలగాలకు విలువైన సమయం ఆదా కావడంతోపాటు దేశ భద్రతపై మరింత దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుంది.

వలస కార్మికులు ప్రతీసారి ఎన్నికలు జరుగుతుంటే ఎన్నో ఇబ్బందులుపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఒకేసారి ఎన్నికలు జరిగితే అంతరాష్ట్ర వలస కార్మికులకు ఇబ్బందులు తప్పుతాయి.

రాష్ట్రాల శాసనసభలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగితే చాలా సమయం, ప్రజాధనం కూడా ఆదా అవుతుంది.ప్రతిసారీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులను బట్టి మతం, కులం వంటి ఇతర విషయాలపై దేశమంతటా చర్చ జరుగుతోంది.

ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఇలాంటి చర్చలు ఒకసారే జరిగి మిగిలిన సమయం దేశం ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంది.ఎన్నికల ఖర్చుకు కళ్లెం వేయవచ్చు ఎన్నికల ఖర్చు ప్రతీ ఐదేళ్లకు గణనీయంగా పెరిగిపోతోంది.1951-52 ఎన్నికలు కేవలం రూ.11 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తే ఆ భారం 2014 వచ్చేసరికి రూ.30 వేలకోట్లకు చేరింది.అదే 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి రూ.60 వేల కోట్లకు చేరింది.దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగితే అదే ఖర్చుతో రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు పాలన వ్యవస్థను ఎన్నుకునే అవకాశం ఉంటుంది.

దీనివల్ల చాలా వరకు ప్రజాధనం వృథా కాకుండా ఉంటుంది.నల్లధనం, ఎన్నికల అవినీతిని అరికట్టడానికి కూడా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దోహద పడుతుంది.1983లో లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.1999లో లా కమిషన్ ఛైర్మన్ గా ఉన్న జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డి తన నివేదికలో కూడా దేశానికి ఒకేసారి ఎన్నికలు జరగడం సముచితంగా ఉంటుందని తన నిర్ణయాన్ని చెప్పారు.వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ( Narendra Modi ) గారు తీసుకున్న నిర్ణయం దేశానికి ఎంతో అవసరం.ఎన్నికల ఖర్చు తగ్గడం, నల్లధనం లేకుండా ఎన్నికల జరగడం, కులం, మతం వ్యవహారాలు పదే పదే చర్చకు రాకుండా ఆగడం, భద్రత బలగాలకు దేశ రక్షణలో నిమగ్నం కావడం వంటి ఎన్నో సానుకూలతలు ఉండటం లాంటి విషయాలపై ఆలోచించి జనసేన పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది.

ప్రధానమంత్రి మోదీ గారి బలమైన సంకల్పానికి అన్ని పక్షాల నుంచి మద్దతు లభిస్తుందని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube