అసంతృప్తులు పెరిగిపోతుండడం, రోజురోజు పార్టీ పరిస్థితి దిగజారుతూ ఉండడం, ఆశించిన స్థాయిలో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత పెరగకపోవడం , ఇవన్నీ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ లో అసహనాన్ని పెంచుతున్నాయి.పార్టీ పరంగా , ప్రభుత్వపరంగా ఎవరికి ఎటువంటి అసంతృప్తులు లేకుండా జగన్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ, అనేక సంక్షేమ పథకాలను, నిర్ణయాలను ప్రకటిస్తూ వస్తున్నారు.2024 ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందనే సర్వే నివేదికలను జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.ఇప్పటికే 175 నియోజకవర్గాల్లోనూ గెలవాలని టార్గెట్ విధించినా, పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోను ఆ స్థాయిలో ఉత్సాహం కనిపించకపోవడం వంటి విషయాలను జగన్ సీరియస్ గా తీసుకున్నారు.
ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజా ప్రతినిధులు , ఎమ్మెల్యే లను జనాల్లోకి పంపుతున్నా, ఉత్సాహంగా ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొనక పోవడం, చాలా చోట్ల తూతూ మంత్రంగా కార్యక్రమాలు చోటు చేసుకోవడం వంటివి జగన్ గుర్తించారు. అందుకే ఆ బాధ్యతను మాజీ మంత్రులు, జిల్లా సమన్వయకర్తలకు బాధ్యతలు అప్పగించారు.
అయితే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల తీరుపై పార్టీ కార్యకర్తలలోను అసంతృప్తులు పెరిగిపోతుండడం , ప్రతి నియోజకవర్గంలోనూ గ్రూపు రాజకీయాలు ఎక్కువై పార్టీకి ఇబ్బందికరంగా మారడం వంటి విషయాలను ఎప్పటి నుంచో జగన్ గుర్తించారు.దీనిలో భాగంగానే ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని జగన్ నిర్ణయించుకున్నారు.
ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.నేరుగా నియోజకవర్గంలోని కార్యకర్తల వద్దకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా చేయడంతో పాటు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరు ఏ విధంగా ఉంది ? రాబోయే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తే గెలుస్తారు ఎలా అనేక అంశాలపై నేరుగా కార్యకర్తల నుంచి జగన్ ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు డిసైడ్ అయ్యారట.

వాస్తవంగా జగన్ పై సొంత పార్టీలోనే అనేక విమర్శలు వ్యక్తం అవుతూ ఉంటాయి.జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఎవరికి అందుబాటులో ఉండరని, సీనియర్ నాయకులకు కూడా జగన్ దర్శన భాగ్యం దొరకడం గగనం అవుతోందని, ఇలా అయితే తమ వ్యక్తిగత, నియోజకవర్గ సమస్యలను గురించి ఎవరికి చెప్పుకోవాలనే బాధను అనేక సందర్భాల్లో అనేకమంది సీనియర్ నాయకులు వ్యక్తం చేశారు .ఎమ్మెల్యేలు, కీలక నాయకుల పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఇక కార్యకర్తలకు జగన్ దర్శన భాగ్యం అనేది అసాధ్యమనే భావన పార్టీ నాయకుల్లోకి వెళ్లిపోవడం, గత కొంతకాలంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగిపోవడం, వీటన్నిటిని గుర్తించి ఇక కార్యకర్తలు, నాయకులు , ఎమ్మెల్యేలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారట.దీనిలో భాగంగానే ఇప్పుడు కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించాలని జగన్ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది.







