తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తిడిపై ఉంది - జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమల పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం శనివారం టీటీడీ నిర్వహించిన సుందర తిరుమల – శుద్ధ తిరుమల కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు.

 It Is The Duty Of Every Devotee To Preserve The Sanctity Of Tirumala Justice Nv-TeluguStop.com

అలిపిరి టోల్ గేట్ వద్ద ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి తో కలసి జెండా ఊపి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.తిరుమల నుండి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డు లోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద జస్టిస్ రమణ పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ, తిరుమల కొండలు పరమ పవిత్రమైనవని చెప్పారు.ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు తమ ఇంట్లో దేవుడి గది లాగే భావించి శుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తిరుమల ను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి టీటీడీ చేస్తున్న కృషిలో ప్రతి భక్తుడు భాగస్వాములు కావాలని కోరారు.2008లో ఈవో శ్రీ ధర్మారెడ్డి ని తమకు ఇలాంటి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు.భగవంతుడు తనకు ఇన్నాళ్లకు ఆ అవకాశం ఇచ్చారని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈవో తనను ఆహ్వానించారని ఆయన తెలిపారు.టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని, ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులను ఆయన అభినందించారు.

ఈవో శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ, 25 రోజుల క్రితం 1600 మంది పారిశుధ్య కార్మికులు ముందస్తు సమాచారం లేకుండా సమ్మెలోకి వెళ్లారని చెప్పారు.భక్తులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో తిరుపతి తో పాటు చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీ ల నుండి పారిశుధ్య కార్మికులను రప్పించి టీటీడీ అధికారులు ఉద్యోగులు పారిశుద్ధ్య పనులు చేశారన్నారు.

ఇదే స్ఫూర్తితో రెండు ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడానికి శనివారం సామూహిక పారిశుధ్య కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు.ఇందులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్గొన్నారని చెప్పారు.

ఇకపై ప్రతినెల రెండో శనివారం సుందర తిరుమల- శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామని ఈవో తెలిపారు.

ఆసక్తి ఉన్న అధికారులు, ఉద్యోగులు, భక్తులు, శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా పాల్గొని తిరుమల ను పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి కృషి చేయాలని కోరారు.

తిరుమలకు భక్తులెవరు ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకుని రావద్దని కోరారు.జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, జాయింట్ కలెక్టర్ శ్రీ బాలాజి, టీటీడీ సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్ ,జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి, ఎస్వీ బీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ సలహాదారు డాక్టర్ జయప్రకాష్ సాయి ,చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, టీటీడీ ఎఫ్ఎ సిఏవో శ్రీ బాలాజి, సి ఎ వో శ్రీ శేష శైలేంద్ర తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు , స్వచ్ఛ ఆంద్ర కార్పొరేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube