ఆమె ఓ రాష్ట్ర మంత్రి కూతురు.బాగా సంపన్న కుటుంబానికి చెందిన యువతి.
పదుల సంఖ్యలో సేవలు చేసేందుకు నౌకర్లు ఉంటారు.ఎంతో దర్జాగా కొనసాగుతోంది ఆమె జీవితం.
అయితేనేం తమ వద్ద డ్రైవర్‌గా ఉన్న వ్యక్తితో ప్రేమలో పడింది.వేరే రాష్ట్రానికి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది.
చివరికి తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని, రక్షించండి అంటూ పోలీసులను వేడుకుంది.ఇదంతా సినిమా కథ మాదిరిగా కనిపిస్తున్నా నిజంగానే జరిగింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకు చెందిన మంత్రి శేఖర్ గారాలపట్టి జయకళ్యాణి.
ఆమెను తండ్రి ఎంతో గారాబంగా పెంచాడు.అయితే ఇటీవల తమ ఇంట్లో పని చేస్తున్న దళితుడైన డ్రైవర్ సతీష్‌ను ప్రేమిస్తున్నట్లు తండ్రికి చెప్పింది.
సతీష్ కూడా ఇదే విషయాన్ని నేరుగా మంత్రికి చెప్పాడు.అయితే కులాంతర వివాహం తనకు అస్సలు ఇష్టం లేదని మంత్రి శేఖర్ తేల్చి చెప్పాడు.
అసలే అధికారంలో ఉన్నారు.పైగా మంత్రిగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు.
ఫలితంగా డ్రైవర్ సతీష్‌ను పోలీసుల సాయంతో రెండు నెలలు చిత్ర హింసలు పెట్టాడనే ఆరోపణలొచ్చాయి.దీనికి సంబంధించి సతీష్ విడుదల చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా సోమవారం తన కుమార్తె కిడ్నాప్ అయిందని పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు.అసలే మంత్రి కుమార్తె కావడంతో తమిళనాడు రాష్ట్రమంతటా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.సతీష్ గురించి కూడా ఆరా తీశారు.ఈ క్రమంలో అందరికీ షాక్ ఇస్తూ బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల పంత్‌ను జయకళ్యాణి-సతీష్ జంట ఆశ్రయించింది.తామిద్దరం మేజర్లమని, ఇష్టప్రకారం హిందూ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నామని జయకళ్యాణి పేర్కొంది.తమ ప్రాణాలకు మంత్రి హోదాలో ఉన్న తన తండ్రి నుంచి ముప్పు ఉందని ఫిర్యాదు చేసింది.
అసలే మంత్రి కుమార్తె, దీంతో పాటు దళితుడితో ప్రేమ వివాహం, తండ్రిని ఎదిరించి పక్క రాష్ట్రంలో పెళ్లి వంటి ట్విస్టులతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.







