వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ( KCR )మూడోసారి జరిగిన ఎన్నికల్లో ప్రజల మెప్పు పొందలేకపోయారు. దీంతో ఎన్నికల కౌంటింగ్ రోజు నుంచి ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు.
కనీసం తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు గాని , బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన ఆయా నియోజకవర్గ ప్రజలకు గాని కృతజ్ఞతలు తెలపలేదు సరి కదా, సీఎల్పీ నేతగా మరికొద్ది గంటల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్న రేవంత్ రెడ్డికి కనీసం శుభాకాంక్షలు చెప్పలేదు.ఇప్పటికే రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావలసిందిగా కెసిఆర్ కు ఆహ్వానం పంపారు.
అయితే కేసీఆర్ ఆ కార్యక్రమానికి వెళ్లే ఛాన్స్ కనిపించడం లేదు.దాదాపు 9 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ ఆ పదవి కోల్పోయిన తర్వాత వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అనే విషయాన్ని కేసిఆర్ మరిచిపోయినట్టుగా కనిపిస్తున్నారు.అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా ఆయన ఇష్టపడకపోవడం , ప్రజలకు, పార్టీ నాయకులకు దూరంగా ఉండడం వంటివి ఆయన వ్యవహారాన్ని తెలియజేస్తున్నాయి.

ముఖ్యంగా కొత్తగా ముఖ్యమంత్రి కాబోతున్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఈ స్థాయికి రావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పై అనే కేసులు నమోదయ్యాయి.ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు.అన్ని విధాలుగా రేవంత్ ను అణిచివేసే ప్రయత్నం చేశారు .అయినా అవన్నీ తట్టుకుని తనతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా రేవంత్ కష్టపడ్డారు.

ఎన్నికల ప్రచారం రాష్ట్రమంతా నిర్వహించి కాంగ్రెస్( Congress ) పై జనాలు ఆదరణ పెంచుకునేలా చేశారు.అయితే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించడం, బీఆర్ఎస్ ను ఓడించడంతో కేసీఆర్ బాగా హర్ట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.అందుకే తమ పార్టీని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలపై ఆయన అలక చెందారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.







