ఏపీలో నవరత్నాలు కొడిగడుతున్నాయా? అన్ని వర్గాలకు అన్నీ ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఒక్కో పథకాన్ని నీరు గారుస్తున్నారా? ముందుగా మైనారిటీలకే దెబ్బ కొట్టారా జగన్? మైనారిటీ యువతులకు పెళ్ళి సమయంలో లక్ష ఇస్తానంటూ ఇచ్చిన హామీని మరచిపోయారా? ఆంక్షల పేరుతో అమ్మవడి పథకాన్ని కూడా తగ్గించివేస్తున్నారా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారా? పథకాల పేరుతో ప్రజలను ఆకట్టుకుని తర్వాత మోసం చేసిన చంద్రబాబుకు ఏపీ ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు.ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలేదంటూ వైసీపీ అధినేతగా ఊరూరా తిరిగిన జగన్ చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు దారుణ పరాజయం పాలయ్యారు.నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి జగన్ కు అధికారం అప్పగించారు.
ప్రతి నిర్ణయాన్ని వివాదం చేసుకుంటూ జగన్ అస్తవ్యస్థ పాలన సాగిస్తున్నారు.అప్పులు చేస్తూ వాటిని కూడా సద్వినియోగం చేయడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు నిధుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల పేరిట నవరత్నాలకు కూడా తూట్లు పొడుస్తున్నారు జగన్.

రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోనే తనకు భగవద్ఘీత, బైబిల్, ఖురాన్ అని చెప్పిన జగన్ నవరత్నాల పేరుతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చారు.వచ్చిన నాటి నుంచి నవ రత్నాలకు తూట్లు పొడుస్తూనే ఉన్నారు.కేంద్రం నుంచి వస్తున్న పథకాలను వైఎస్ఆర్, జగన్ పేర్లు తగిలించుకుని ప్రజల ఖాతాల్లోకి నిధులు వేస్తున్నారు.
రైతు బంధు నగదుకు కేంద్రం ఇస్తున్న నిధులను కలిపి అన్నీ తనవిగా చెప్పుకుంటున్నారు.అలాగే మైనారిటీ యువతులకు పెళ్ళి ఖర్చు కింద లక్ష రూపాయలు ఇస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు.
కులాంతర వివాహాలు చేసుకున్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్న హామీ కూడా అమలు చేయడంలేదు.రంజాన్ సందర్భంగా ముస్లింలకు చంద్రబాబు తోఫా పేరుతో 10 లక్షల కుటుంబాలకు కానుక ఇచ్చేవారు.
ఆ పథకాన్ని ఎత్తేశారు.ఇలా ముస్లిం మైనారిటీలకు ఇస్తున్న, ఇస్తామన్న పథకాలు అమలుకు నోచుకోవడంలేదు.

ఇక అమ్మవడి పేరుతో పిల్లల్ని బడికి పంపుతున్న తల్లుల పేరుతో ఏటా 15 వేలు ఇస్తామన్న హామీని కూడా క్రమంగా నీరుగారుస్తున్నారు.మొదటి రెండేళ్ళు జనవరిలో ఇచ్చిన అమ్మవడి ఈ ఏడాది జూన్ కి వాయిదా పడింది.ఈ నెల 27న ఇవ్వాలని నిర్ణయించారు.దీనికి కూడా అనేక ఆంక్షలు విధించారు.మొదట్లో ఎంతమంది పిల్లలున్నా సరే అన్నారు.తర్వాత ఒక బిడ్డకే పరిమితం చేశారు.
పాఠశాలల్లో మరుగుదొడ్డ నిర్వహణ పేరుతో గత ఏడాది వెయ్యి తగ్గించారు.ఈ ఏడాది స్కూళ్ళలో మౌలిక వసతుల కల్పనకు అంటూ మరో వెయ్యి కోత విధించబోతున్నారు.
అంటే ఈ నెల 27న ఇచ్చే అమ్మ వడిలో ఒక్కో తల్లికి వచ్చేది 13 వేల రూపాయలే.పైగా జనవరిలో ఇవ్వకుండా జూన్ కి వాయిదా వేయడంతో జగన్ ఐదేళ్ళ పాలనలో నాలుగుసార్లే అమ్మవడి అందుతుంది.
ఎంతో ఆర్భాటంగా పథకాలు ప్రారంభించి చివరికి వాటిని ఎలా నీరుగార్చాలో బాగా ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.తన విధానాలతో ప్రజల్లో అసంతృప్తి పెంచుకుంటున్నారు.