సింగరేణి సంస్థ లో ఉత్పత్తి పద్ధతులు, రక్షణ, నాణ్యత అంశాలపైన, వినూత్న పరిశోధనలు చేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ ఆర్ అండ్ డీ శాఖకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐ ఎస్ వో 9001:2015 సర్టిఫికెట్ లభించింది.ఈ మేరకు ఐ.
ఎస్.వో సర్టిఫికేట్ ను సింగరేణి ఆర్ అండ్ డీ జీఎం ఎస్ డి ఎం సుభానీకి గురువారం అందజేశారు.
దీనిపై జీఎం సుభానీ మాట్లాడుతూ సింగరేణి సంస్థకు రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ కు ఐ.ఎస్.వో గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.సింగరేణి ఆర్ అండ్ డీ శాఖ ఆధునిక మైనింగ్ పద్ధతులను అమలు జరిపే క్రమంలో ఓపెన్ కాస్టు మరియు భూ గర్భ గనుల్లో పలు అంశాలపై సొంతంగా పరిశోధనలు జరుపుతూ అవసరమైన సమాచారాన్ని యాజమాన్యానికి అందిస్తుందని, దీనిలో ప్రధానంగా భూ గర్భ గనుల్లో స్ట్రాటా కంట్రోల్, వెంటిలేషన్, ఓపెన్ కాస్టు గనుల్లో ఓబీ వాలుతలాల స్థిరీకరణ, బ్లాస్టింగ్ పద్ధతులపై పరిశోధనలు జరిపి లాభదాయకమైన సురక్షితమైన పర్యావరణ హితమైన సూచనలను చేసిందన్నారు.
అలాగే దేశంలోనే తొలిసారిగా మణుగూరు ఏరియాలోని పగిడేరు వద్ద జియో థర్మల్ పవర్ ప్లాంట్ భూ గర్భం నుంచి ఉబికి వచ్చే వేడి నీటితో విద్యుత్ ఉత్పత్తి ను ఏర్పాటు చేస్తోందని, అలాగే త్వరలోనే బొగ్గు నుంచి మిథనాల్ తయారు చేసే మోడల్ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నామని తెలిపారు.
సింగరేణి ఆర్ అండ్ డీ శాఖ స్వయంగా చేపట్టిన పరిశోధనల వల్ల కంపెనీకి సుమారు 3.89 కోట్ల రూపాయలు ఆదా చేసిందని తెలిపారు.సింగరేణి ఆర్ అండ్ డీ శాఖ అంతర్జాతీయంగా ఉన్న బొగ్గు గనుల పరిశోధనల సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ పనిచేస్తోందని, తమ పరిశోధనల వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఉద్యోగులకు వివరించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోందని వివరించారు.
సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు గత మూడేళ్ల కాలంలో తమ సంస్థ మరింత విస్తృతంగా పరిశోధనలు చేపట్టిందని, తద్వారా సంస్థ పురోగతికి తోడ్పడుతోందన్నారు.
ఈ అంతర్జాతీయ గుర్తింపు రావడానికి తగిన ప్రోత్సాహాన్ని అందించిన సంస్థ ఛైర్మన్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.







