భారత్ – యూకేలు ఆరోగ్య సంరక్షణ రంగంలో సహజ భాగస్వాములని అన్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ.గురువారం లండన్‌లో జరిగిన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ వార్షిక సదస్సు నాల్గవ ఎడిసన్‌లో ఆయన న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాండవీయా మాట్లాడుతూ.డిజిటల్ ఆరోగ్యం రంగంలో ఇరుదేశాలు బలమైన సహకారాన్ని నిర్మించుకోవచ్చని ఆయన ఆకాంక్షించారు.ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయడం ద్వారా పరిశోధన, ఆవిష్కరణల విషయంలో భారత్- యూకే కార్యక్రమాలకు గొప్ప ఉదాహరణగా మాండవీయ అభివర్ణించారు.ఆరోగ్య రంగంలో సహజ భాగస్వాములైన భారత్- యూకేల బంధం కోవిడ్ సమయంలో మరింత బలంగా మారిందని కేంద్ర మంత్రి చెప్పారు.
భాగస్వామ్యంతో ఏం సాధించవచ్చో కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధన, తయారీ రుజువు చేసిందని మాండవీయ గుర్తుచేశారు.కొత్తగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ హెల్త్, జెనోమిక్స్, హెల్త్‌కేర్‌లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం తదితర రంగాల్లో భారత్ – యూకేల పరస్పర సహకారం కోసం ఎదురుచూస్తున్నామని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
మెడికల్ టూరిజానికి ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టడానికి తమ ప్రభుత్వ హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా విజన్‌ను మన్సూఖ్ మాండవీయ వివరించారు.ప్రపంచ ఫార్మసీలో భారత స్థానం, ఆయుర్వేదం వంటి సాంప్రదాయ ఔషధాల సుధీర్ఘ చరిత్రను ఆయన ప్రస్తావించారు.
ఫిక్కీ, సీఐఐ, బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (బీఏపీఐవో), ఫార్మాస్యూటికల్ కంపెనీలైన Wockhardt, అరబిందోలు ఇండో- యూకే హెల్త్‌కేర్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించాయి.







