కరోనా… ఈ పదాన్ని జనాలు ఇప్పట్లో మరువలేరు.మానవ ప్రపంచంలో కరోనా ఒక మాయని మచ్చని మిగిల్చింది.
అది తెచ్చిపెట్టిన విపత్తులు ఇప్పటికీ మానవాళికి శాపంలాగా వెంటాడుతున్నాయి.ఇకపోతే నిన్న మొన్నటి వరకు కరోనా వేవ్ కొన్ని ప్రపంచ దేశాలను వెంటాడింది.
అదృష్టవశాత్తు ఇండియాలో దాదాపుగా తగ్గుముఖం పట్టింది.ఇక కరోనాకి పురుడు పోసిన చైనా అయితే నేటికీ దాని ఫలితాన్ని అనుభవిస్తోంది.
దాంతోనే భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో చాలా స్ట్రిక్ట్ కోవిడ్ నిభంధనలు ఉండేవి.అయితే తాజాగా కేంద్రం వాటిని సడలించింది.
ఈ క్రమంలోనే వివిధ దేశాలు అయినటువంటి సింగపూర్, చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, కొరియా, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ముందస్తు కోవిడ్ పరీక్షలు, ఎయిర్ సువిధ ఫారమ్‌ను అప్లోడ్ చేసే విధానాన్ని ఇకనుండి నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులలో కొత్త వేరియంట్లను గుర్తించడానికి కేవలం 2 శాతం ప్రయాణికులకు మాత్రమే యాదృచ్ఛిక పరీక్షలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టంచేసింది.
ఇకపోతే 2022 డిసెంబర్లో పలు దేశాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ల కేసుల పెరిగాయి కాబట్టి కేంద్ర ఆరోగ్య శాఖ అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలను తప్పనిసరి చేసింది.ఆ తరువాత ఆయా దేశాల్లో కేవిడ్ కేసులు బాగా తగ్గాయి.దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణీకులకు కోవిడ్ నిబంధనల్ని సడలించింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, గత 28 రోజులలో కోవిడ్ కొత్త కేసుల సంఖ్యలో 89శాతం తగ్గింది.
భారత్ లో కూడా కోవిడ్ కొత్త కేసులు పూర్తిగా తగ్గాయి.ఇపుడు దేశంలో రోజుకు 100 కంటే తక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.