రాజకీయంలో వారసులు ఉండడం సహజం.కొంత మంది వారసులు తమ తండ్రులను మించి రాజకీయాల్లో రాణిస్తున్నారు.
కొంత మంది మాత్రం అలా ఏదో సోసోగా నడిపిస్తున్నారు.ఇప్పుడు ఈ విషయాలను కాసేపు పక్కన పెడితే ఏపీలో ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.2024 ఎన్నికల్లో మనం చాలా మంది వారసులను చూసేందుకు రెడీ అయిపోవాలని లెక్కలు చెబుతున్నాయి.ఇప్పటికే ఏపీ టీడీపీ కి చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు తమ వారసులను తీసుకొచ్చేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు.
వీరి వారసులు కూడా ఇందుకు పూర్తి సమాయత్తం అవుతున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఈ ఇద్దరి నేతల మధ్య రాజకీయ పోరు రంజుగానే నడిచింది.అదేంటి ఇద్దరూ ఒకే పార్టీ వారు కదా.పోరు ఎలా ఉంటుందంటే అదంతే కొన్ని చోట్ల అటువంటివి తప్పవు అనే సమాధానమే వస్తుంది.అయ్యన్న పాత్రుడి పెద్ద కొడుకు విజయ్ పాత్రుడు.

ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు.ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు పక్కా అనే టాక్ వినిపిస్తోంది.ఇక మరో మాజీ మంత్రి కుమారుడు సైతం లోకేష్ టీమ్ లో మెంబర్ గానే ఉన్నాడు.
ఆయనే మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు కొడుకు గంటా రవితేజ.రవి తేజ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు.అన్నీ కుదిరితే 2024 ఎన్నికల్లో పోటీకి ఈ ఇద్దరు యువనేతలు సై అంటున్నారు.ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ యువనేతలకు, వారి అనుచర గణానికి, సీనియర్లకు ఆశలు కలుగజేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లను యువతకే కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు.దీంతో అందరూ వీరికి టికెట్లు పక్కా అని డిసైడ్ అయిపోయారు.