ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మంగళవారం మండల తహాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది.

అనంతరం మండల తహాసిల్దార్ జయంత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంద అనిల్ కుమార్, మల్లారపు ప్రశాంత్ లు మాట్లాడుతూ ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండల విద్యార్థుల చిరకాల కాంక్ష ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అని నిత్యం మండలంలో వందలాది మంది విద్యార్థులు ఇంటర్ విద్యను పూర్తి చేసుకుని డిగ్రీ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి వస్తుందని, విద్యార్థుల సౌకర్యార్థం కోసం మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఏళ్ల తరబడి ఎస్ఎఫ్ఐ అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని గతంలో నియోజకవర్గ మంత్రి కేటీఆర్ సైతం ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు.

కేటీఆర్ పర్యటన ఉన్నప్పుడల్లా డిగ్రీ కళాశాల కోసం ఎక్కడ అడుగుతామని అనునిత్యం అరెస్టులతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధిస్తున్నారని వెంటనే కేటీఆర్ కు ఉమ్మడి ఎల్లారెడ్డిపేట విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.ప్రైవేటు కార్పోరేటు డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించలేక పేద మధ్యతరగతి విద్యార్థులు మధ్యలోనే చదివి ఆపేసి కూలీలుగా మారుతున్నారని, మరికొందరు గల్ఫ్ బాటపడుతున్నారని, మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక దూర పట్టణాలకు వెళ్లలేకపోతున్నారని అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసి మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో డిగ్రీ కళాశాల కొరకు ఎస్ఎఫ్ఐ ఉద్యమ కార్యచరణ రూపొందించుకుంటామని హెచ్చరించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, కుర్ర రాకేష్, గుండెల్లి కళ్యాణ్ కుమార్, జిల్లా నాయకులు పెండేల ఆదిత్య, అనిల్, జశ్వంత్, దినేష్, వెన్నెల, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News