అసలు రాష్ట్రానికి చిరంజీవి ఏమి చేసాడు ? రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్నా ఏపీ గురించి అయన అస్సలు పట్టించుకోలేదు.అసలు చిరంజీవి రాజకీయ నాయకుడిగానే పనికిరాడు ఇలా అనేక అనేక విమర్శలు ఇతర పార్టీ నేతల నుంచి సొంత పార్టీ నేతల వరకు ఎన్నో విమర్శలు చిరు ఎదుర్కున్నాడు.
ప్రజా రాజ్యం మొదలుపెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ లో వీలనం వరకు రాజకీయంగా చిరుని టీడీపీ వెంటాడింది.అయితే ఇప్పడు అనూహ్యంగా ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ అసెంబ్లీలో పొగిడేస్తున్నారు.
చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి చేసిన మంచి పనుల గురించి చెబుతున్నారు.మొన్నామధ్య అసెంబ్లీ లో టీడీపీ ఎమ్యెల్యే ఒకరు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెగా టూరిజం సర్క్యూట్ కోసం వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసారంటూ చెప్పుకొచ్చారు.

ఈ రోజు అసెంబ్లీ లో కూడా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధికి చేపట్టిన చర్యల గురించి చెప్పుకొచ్చారు.పుష్కరాల సమయంలో గోదావరి ప్రాంతాన్ని నిర్మించడం కోసం అఖండ గోదావరి ప్రాజెక్టు ఏర్పాటు చేశారని, అప్పుడు కేంద్ర మంత్రి గా ఉన్న చిరంజీవి గారు ఈ ప్రాజెక్టు కోసం 100 కోట్ల రూపాయలు పైగా కేటాయించడమే కాకుండా నిధులు విడుదల చేశారని బుచ్చయ్య చౌదరి అన్నారు.కడియం లంక లో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారని, కానీ 2014 లో ప్రభుత్వం ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసిందని అన్నారు.

ఈ వ్యాఖ్యలకు సమాధానంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు చేసిన మంచి పనుల గురించి చెప్పుకొచ్చారు.గతంలో భీమిలి అభివృద్ధి కోసం చిరు 50 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుండి తీసుకువచ్చి కేటాయిస్తే, తెలుగుదేశం ప్రభుత్వం ఆ 50 కోట్ల లో కనీసం పది కోట్ల ను కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేయలేదని విమర్శించారు.ప్రస్తుత పరిస్థితి చూస్తే అన్ని పార్టీలు చిరుని పొగడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు అంతుపట్టడంలేదు.
ప్రస్తుతం ఆయన బిహేపీలోకి వెళ్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను తమ పార్టీలో చేర్చుకునేందుకు వీలుగా ముందు నుంచే వైసీపీ, టీడీపీ ఇలా మాట్లాడుతున్నాయా అనే సందేహాలు కూడా లేకపోలేదు.అయితే చిరుకి ఇప్పటి ప్రజల్లో క్రేజ్ ఉండడం, బలమైన సామజిక వర్గం వారు ఆయన్ను ఆరాధించడం తదితర కారణాలన్నిటితో చిరుని ప్రసన్నం చేసుకునేందనుకు పార్టీలు పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది.