తమిళ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే‘ సినిమా మీరు చూసే ఉంటారు.ఆ సినిమాలో విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులను, పోలీసులను బురిడీ కొట్టించి హీరో చేసే స్మగ్లింగ్ కార్యకలాపాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి.
పోలీసుల కళ్లుగప్పి అందులో హీరో పాత్రధారి చిత్రవిచిత్రాలుగా స్మగ్లింగ్ చేస్తుంటాడు.ఇక తాజాగా వచ్చిన పుష్ప సినిమాలోనూ హీరో పాత్రధారి ఎర్రచందనాన్ని పోలీసుల కంటపడకుండా సరిహద్దులు దాటించేస్తుంటారు.
ఇవి సినిమాలే అయినా, వాస్తవంలోనూ ఇదే తరహా ఘటనలు కనిపిస్తున్నాయి.చాలా మంది డ్రగ్స్ స్మగ్లర్లు తెలివి మీరుతున్నారు.
పోలీసులను సులువుగా బోల్తా కొట్టిస్తూ దేశంలో యథేచ్చగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేస్తున్నారు.పోలీసులు ఎక్కడికక్కడ వీరి చర్యలను అడ్డుకుంటున్నా డ్రగ్స్ రవాణా కొనసాగుతూనే ఉంది.
తాజాగా కొందరు డ్రగ్స్ స్మగ్లర్ల తీరు చర్చనీయాశంగా మారింది.
మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నిరోధించడం ఇప్పుడు ప్రభుత్వాలకు, పోలీసులకు పెద్ద పనిగా మారింది.
రోజుకో కొత్త పద్ధతిలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.అందుకు తగిన మార్గాలన్నీ వినియోగిస్తున్నారు.
డ్రగ్స్ వ్యాపారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.కఠిన కేసులున్నా, తమ దందా తమదే అంటూ ముందుకు సాగుతున్నారు.
తాజాగా చెన్నైలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.ఫ్యాన్సీ గిఫ్ట్ బాక్సులలో డ్రగ్స్ తరలించి, కిలోల లెక్కన విక్రయిస్తున్నారు.
మెరీనా బీచ్, చెపాక్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.ఓ లాడ్జిలో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో వీరి దందా బయటపడింది.
తనిఖీల్లో భారీగా డ్రగ్స్ దొరికాయి.నాలుగున్నర కిలోల డ్రగ్స్ (మెథాంఫెటమైన్, యాంఫెటమైన్) స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన డ్రగ్స్ విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశారు.
గిఫ్ట్ బాక్సుల రూపంలో డ్రగ్స్ తరలిస్తుండడంపై పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చెన్నై నుంచి శ్రీలంక మీదుగా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది.
పట్టుబడిన వ్యక్తులు గత రెండేళ్లుగా దేశం నుంచి డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.







