అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచిన సె రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ( Se Robert F.Kennedy ) ఎన్నికల రేసులో నుంచి తప్పుకోవడంతో దేశ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి.పోటీ నుంచి వైదొలగడంతో పాటు రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) తన మద్ధతును ప్రకటించారు కెన్నెడీ.అనంతరం శుక్రవారం అరిజోనాలోని గ్లెన్డేడ్ డెసర్ట్ డైమండ్ అరేనాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కెన్నెడీపై ప్రశంసల వర్షం కురిపించారు ట్రంప్.
ఆయన గొప్ప వ్యక్తని, అమెరికన్ హక్కుల ఛాంపియన్ అని పేర్కొన్నారు.బాబీ (రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ) 16 నెలలుగా అసాధారణ రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడని ట్రంప్ తెలిపారు.రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ తండ్రిని, అతని బంధువు మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీలు( John F Kennedy ) అమెరికన్ విలువలను కాపాడారని.వారిద్దరూ పై నుంచి బాబీని చూసి గర్వపడుతున్నారని ట్రంప్ అన్నారు.
ర్యాలీ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.డెమొక్రాట్లు .కెన్నెడీ జూనియర్ పట్ల దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు.
మరోవైపు.అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకుని ట్రంప్‌కు మద్ధతివ్వాలని రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ తీసుకున్న నిర్ణయాన్ని కెన్నెడీ కుటుంబం తీవ్రంగా ఖండించింది.అతని సోదరి కెర్రీ కెన్నెడీ ( Kerry Kennedy )మాట్లాడుతూ.కుటుంబ ప్రాథమిక సూత్రాలకు ఇది ద్రోహమన్నారు.ఇదే సందేశంలో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్, ఉపాధ్యక్ష అభ్యర్ధి టిమ్ వాల్జ్‌లకు కెర్రీ మద్ధతు పలకడం విశేషం.మా సోదరుడు బాబీ ఇవాళ ట్రంప్‌ను సమర్ధించడం మా నాన్న, మా కుటుంబం కొనసాగించిన విలువలకు ద్రోహం చేయడమేనని కెర్రీ విచారం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు అమెరికన్ రాజకీయాల్లో దుమారం రేపుతోన్నాయి.మరి దీనిపై కెన్నెడీ ఎలా స్పందిస్తారో చూడాలి.